KCR: ఆగస్టు 15 తర్వాత అసలైన పాలన చూస్తారంటే... ఇన్నాళ్లు నకిలీ పాలన చేశారా?: కేసీఆర్ కు దత్తాత్రేయ ప్రశ్న

  • కొత్త మున్సిపల్ చట్టంతో స్థానిక సంస్థలు నిర్వీర్యమవుతాయి
  • కేటీఆర్ వ్యాఖ్యలు అహంకారపూరితంగా ఉన్నాయి
  • మెజార్టీ మున్సిపాలిటీలను బీజేపీ గెలుచుకుంటుంది

అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ, ఆగస్టు 15 తర్వాత అసలైన పాలన చూస్తారని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ సెటైర్లు వేశారు. ఆగస్టు 15 తర్వాత అసలైన పాలనను చూస్తారని కేసీఆర్ చెప్పారని... అంటే, ఇంత కాలం నకిలీ పాలన చేశారా? అని ఎద్దేవా చేశారు. ఈఎస్ఐలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ కోరే ధైర్యం కూడా కేసీఆర్ కు లేదని అన్నారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన మున్సిపల్ చట్టంతో స్థానిక సంస్థలు నిర్వీర్యమవుతాయని దత్తాత్రేయ విమర్శించారు. బీజేపీపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకారపూరిత స్వభావాన్ని చూపుతున్నాయని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ మున్సిపాలిటీలను బీజేపీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News