Narendra Modi: ప్రధాని నరేంద్రమోదీ ఎన్నిక రద్దు చేయండి: అలహాబాద్‌ హైకోర్టులో పిటిషన్

  • ఎస్పీ అభ్యర్థి తేజ్‌ బహుదూర్‌ పిటిషన్‌ దాఖలు
  • అన్యాయంగా తన నామినేషన్‌ తిరస్కరించారని  కేసు
  • మోదీకి నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం

ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికను రద్దుచేయాలంటూ అలహాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలయ్యింది. సరైన కారణాలు లేకుండా తన నామినేషన్‌ తిరస్కరించి తన హక్కులను కాలరాశారని, అందువల్ల మోదీ ఎన్నిక చెల్లదంటూ సమాజ్‌వాదీ పార్టీ  అభ్యర్థి, బీఎస్‌ఎఫ్‌ జవాను తేజ్‌బహుదూర్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌ లోని వారణాసి నియోజకవర్గం నుంచి నరేంద్ర మోదీ గెలిచిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో ఈ నియోజకవర్గం నుంచి ఎస్పీ అభ్యర్థిగా తేజ్‌బహుదూర్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. నిబంధనల మేరకు నామినేషన్‌ పత్రాలు లేవంటూ ఎన్నికల అధికారులు అప్పట్లో నామినేషన్‌ తిరస్కరించారు.

దీనిపై కోర్టులో సవాల్‌ విసిరారు తేజ్‌బహుదూర్‌. సరైన కారణం లేకుండానే అధికారులు తన నామినేషన్‌ తిరస్కరించారని పిటిషనర్‌ పేర్కొన్నారు. కాగా ఈ పిటిషన్‌ను ఎం.కె.గుప్తా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి మోదీకి నోటీసులు జారీ చేసింది. తదుపరి వాదనలు ఆగస్టు 21న వింటామని పిటిషనర్‌ తరపు న్యాయవాదికి స్పష్టం చేసింది.

More Telugu News