TRS: నాలుగు సీట్లు గెలవగానే ఎగిరెగిరి పడుతున్నారు: బీజేపీపై కేటీఆర్ ఫైర్

  • మునిసిపల్ ఎన్నికల్లో ఎవరేంటో తెలుస్తుంది
  • బీజేపీ యావ అంతా టీఆర్ఎస్ నుంచి ఎవరిని లాగుదామా అనే
  • కవితే కాదు.. రాహుల్ కూడా ఓడిపోయారు

విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలవగానే భూమ్మీద ఆగడం లేదని, ఎగిరెగిరి పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో వాళ్లకు అసలు అభ్యర్థులు ఎక్కడ ఉన్నారని, త్వరలో రాబోతున్న మునిసిపల్ ఎన్నికల్లో వాళ్ల అసలు రంగు బయటపడుతుందని అన్నారు. ఎంతసేపూ టీఆర్ఎస్ నుంచి ఎవరిని లాగుదామా? అని చూస్తున్నారని విమర్శించారు. మునిసిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తాను మరోమారు చాటుతామని, రెండోస్థానం కోసం కాంగ్రెస్, బీజేపీలు పోటీపడాల్సి ఉంటుందని అన్నారు. ఎవరెవరో ఏమేమో మాట్లాడతారని, వాటన్నింటికీ బదులివ్వాల్సిన ఖర్మ తనకు పట్టలేదని కేటీఆర్ తేల్చి చెప్పారు.

లోక్‌సభ ఎన్నికల్లో తాము మెజారిటీ సీట్లు గెలుచుకున్నామని పేర్కొన్న కేటీఆర్.. నాలుగు సీట్లు గెలుచుకున్న బీజేపీ నాయకులు ఢాం.. ఢూం అంటూ ఎగిరెగిరి పడుతున్నారని ఎద్దేవా చేశారు. కవిత ఓటమి గురించి ప్రస్తావించినప్పుడు రాహుల్ గాంధీ కూడా ఓడిపోయారని బదులిచ్చారు. సచివాలయానికి కొత్త భవన నిర్మాణంపై మాట్లాడుతూ.. నాలుగైదు రాష్ట్రాలు కొత్త భవనాలను నిర్మించుకున్నాయని, ప్రతీదానినీ వ్యతిరేక దృష్టితో చూడడం సరికాదని హితవు పలికారు.

గవర్నర్ నరసింహన్ మార్పుపై తమకు ఎటువంటి సమాచారం లేదన్నారు. గవర్నర్ చాలా చక్కగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. ఇటీవల బీజేపీలోకి వెళ్లిన టీఆర్ఎస్ నేతల విమర్శల గురించి మాట్లాడుతూ.. పార్టీని వీడి వెళ్లేవారు ఎప్పుడూ మంచి చెప్పరని, వెళ్తూవెళ్తూ నాలుగు రాళ్లు వేసేసి వెళ్లిపోతారని కేటీఆర్ పేర్కొన్నారు.

More Telugu News