Hyderabad: హైదరాబాద్‌లో అర్ధరాత్రి భారీ వర్షం.. రోడ్లు జలమయం

  • శుక్రవారం రాత్రి 10:30 గంటలకు మొదలైన వాన
  • ఉప్పల్‌లో అత్యధికంగా 1.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు
  • స్తంభించిన ట్రాఫిక్.. జలమయమైన లోతట్టు ప్రాంతాలు

రుతుపవనాలు ప్రవేశించి చాలా రోజులే అయినా హైదరాబాద్‌పై వాటి ప్రభావం ఇప్పటి వరకు పెద్దగా లేదు. అయితే, గతరాత్రి మాత్రం నగరంలో భారీ వర్షం పడింది. శుక్రవారం రాత్రి 10:30 గంటలకు ప్రారంభమైన వర్షం అర్ధ రాత్రి దాటిన వరకు కురిసింది. దీంతో నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాత్రి 11 గంటలకే ఉప్పల్‌లో అత్యధికంగా 1.9 సెంటీమీటర్ల వర్షం పడింది. కూకట్‌పల్లిలో 1.65, కాప్రాలో 1.63 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది.

వర్షం కారణంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోవడంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు జీహెచ్ఎంసీ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు రోడ్లపైకి చేరుకున్నారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దాన కిశోర్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ స్వయంగా పనులను పర్యవేక్షించారు. ఇక నగరంతో పోలిస్తే శివార్లలో మరింత భారీ వర్షం పడింది. కందుకూరులో 7.6, మహేశ్వరంలో 7.48, కడ్తాల్‌లో 4.3, కేశంపేటలో 4.13, తాండూరులో 4.12, బాలాపూర్‌లో 3.03 సెంటీమీటర్ల మేర వాన కురిసింది. కాగా, తెలంగాణలో మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

More Telugu News