ఐసీసీ తమ జట్టును సస్పెండ్ చేయడంపట్ల ఆవేదనాభరిత ట్వీట్లు చేసిన జింబాబ్వే క్రికెటర్లు

19-07-2019 Fri 18:04
  • జింబాబ్వే జట్టును సస్పెండ్ చేసిన ఐసీసీ
  • జింబాబ్వే బోర్డులో రాజకీయ ప్రమేయం ఉందన్న ఐసీసీ వర్గాలు
  • దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన జింబాబ్వే క్రికెటర్లు
అంతర్జాతీయ క్రికెట్ నుంచి జింబాబ్వేను సస్పెండ్ చేస్తూ ఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని జింబాబ్వే క్రికెటర్లు ఓ విషాదంగా భావిస్తున్నారు. జింబాబ్వే క్రికెట్ బోర్డులో రాజకీయ జోక్యం ఎక్కువైందని, తమ రాజ్యాంగం ప్రకారం సభ్య దేశాల క్రికెట్ బోర్డులో రాజకీయ నేతల ప్రమేయం ఉండకూడదంటూ ఐసీసీ జింబాబ్వే క్రికెట్ పై వేటు వేసిన సంగతి తెలిసిందే. దీనిపై జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.

ఐసీసీ తీసుకున్న నిర్ణయంతో ఎంతోమంది క్రికెటర్ల కెరీర్ లు ముగిసిపోతాయని ట్వీట్ చేశాడు. ఈ నిర్ణయం ఎన్నో కుటుంబాలపై ప్రభావం చూపిస్తుందని, ఎందరో నిరుద్యోగులుగా మారతారని బాధను వెలిబుచ్చాడు. ఇప్పటివరకు ఓ జట్టుగా ఉన్న తాము ఇకమీదట పరాయివాళ్లలా మిగిలిపోతామని విచారం వ్యక్తం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ కు తాను ఈ విధంగా గుడ్ బై చెప్పాల్సి వస్తుందని ఊహించలేదని పేర్కొన్నాడు.

మరో క్రికెటర్ బ్రెండన్ టేలర్ కూడా ఐసీసీ నిర్ణయంపై దిగ్భ్రాంతి చెందాడు. జింబాబ్వే క్రికెట్ బోర్డులో రాజకీయ ప్రమేయం ఉందని ఐసీసీ ఎలా చెబుతుందని టేలర్ ప్రశ్నించాడు. తమ బోర్డు చైర్మన్ ఎంపీ కాదని, వందలాదిమంది నిజాయతీపరులైన ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, మైదాన సిబ్బంది పూర్తిగా జింబాబ్వే క్రికెట్ కోసం అంకితమయ్యారని, ఇప్పుడు అందరూ రోడ్డున పడ్డారని బాధను వ్యక్తపరిచాడు.