Telangana: ఐదు బిల్లులకు ఆమోదముద్ర.. తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా

  • కొత్త మున్సిపాలిటీ బిల్లుకు ఆమోదం
  • బోధనా వైద్యుల వయోపరిమితి పెంపు బిల్లుకు ఆమోదముద్ర
  • పంచాయతీరాజ్ 2వ సవరణ బిల్లుకు ఆమోదం

తెలంగాణ అసెంబ్లీ ఐదు బిల్లులకు ఆమోదముద్ర వేసింది. కొత్త మున్సిపాలిటీ బిల్లు-2019, మున్సిపల్ నిబంధనల బిల్లు, రుణ విమోచన కమిషన్ నియామక బిల్లు, బోధనా వైద్యుల వయోపరిమితి పెంపు బిల్లు, పంచాయతీరాజ్ 2వ సవరణ బిల్లుకు సభ ఆమోదముద్ర వేసింది. నిన్న, ఈరోజు తెలంగాణ శాసనసభ ప్రత్యేకంగా సమావేశమైన సంగతి తెలిసిందే. రెండు రోజుల్లో 4 గంటల 44 నిమిషాల పాటు అసెంబ్లీ కొనసాగింది. బిల్లులకు ఆమోదముద్ర వేసిన తర్వాత సభ నిరవధికంగా వాయిదా పడింది.

ఈనాటి సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ, సమయానుకూలంగా చట్టాలను సవరించాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. సరైన మార్పులు చేయకపోతే... భవిష్యత్ తరాలకు అన్యాయం చేసినవారమవుతామని అన్నారు. జిల్లా కలెక్టర్లకు విశేషాధికారాలను కట్టబెట్టడంపై కాంగ్రెస్ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని... కలెక్టర్ వ్యవస్థను కించపరిచేలా సూచనలు చేయడం సరికాదని అన్నారు. నీటి ప్రాజెక్టులపై కూడా అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారని... ప్రాజెక్టు నిర్మాణాలను అడ్డుకోవడానికి కోర్టులో వందల కేసులు వేస్తున్నారని విమర్శించారు. ఒక సరైన ప్రణాళిక ప్రకారం అభివృద్ధి పనులను చేపడుతుంటే... అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

More Telugu News