Andhra Pradesh: ఈ తాగుబోతు టీచర్ మాకోద్దు.. విశాఖలో విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన!

  • స్కూలులో పాఠాలు చెప్పడంలేదని ఫిర్యాదు
  • ఆందోళనను సీరియస్ గా తీసుకున్న అధికారులు
  • తాగుబోతు టీచర్ పై సస్పెన్షన్ వేటు

పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన టీచర్ దారితప్పాడు. పూటుగా మద్యం సేవించి పాఠశాలకు రావడం మొదలుపెట్టాడు. దీంతో గ్రామస్తులంతా ఉన్నతాధికారులకు విషయం విన్నవించడంతో సదరు టీచర్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఘటన   విశాఖపట్నం జిల్లాలో ఈరోజు చోటుచేసుకుంది.

విశాఖపట్నం జిల్లా హుకుంపేట మండలం రంగపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పూర్ణచంద్రరావు అనే ఉపాధ్యాయుడు పనిచేస్తున్నాడు. అయితే మద్యానికి బానిసైన పూర్ణచంద్రరావు ఉదయాన్నే పూటుగా మందుకొట్టి స్కూలుకు వచ్చేవాడు. అనంతరం పిల్లలకు పాఠాలు చెప్పకుండా నిద్రపోయేవాడు. ఆయన ప్రవర్తనతో విసిగివేసారిపోయిన రంగపల్లి గ్రామస్తులు పాడేరు ఐటీడీఏ కార్యాలయం వద్ద తమ పిల్లలతో కలిసి ఆందోళనకు దిగారు.

మద్యం సేవించి పాఠశాలకు వస్తున్న పూర్ణచంద్రరావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన విద్యాశాఖ ఉన్నతాధికారులు తాగుబోతు టీచర్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఆయన స్థానంలో వీలైనంత త్వరగా మరో ఉపాధ్యాయుడిని నియమిస్తామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు, విద్యార్థులు శాంతించారు.

More Telugu News