జింబాబ్వే క్రికెట్‌కు భారీ షాక్.. సస్పెండ్ చేసిన ఐసీసీ

19-07-2019 Fri 08:16
  • ఐసీసీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన జింబాబ్వే
  • బోర్డులో రాజకీయ జోక్యాన్ని తీవ్రంగా పరిగణించిన ఐసీసీ
  • ఐసీసీ టోర్నీల్లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయిన జింబాబ్వే
జింబాబ్వే క్రికెట్‌కు ఐసీసీ భారీ షాకిచ్చింది. ఐసీసీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 2.4(సి), (డి)లను ఉల్లంఘించిన కారణంగా ఆ జట్టుపై వేటేసింది. లండన్‌లో జరిగిన బోర్డు మీటింగ్ అనంతరం ఈ నిర్ణయాన్ని ప్రకటించిన ఐసీసీ తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. ఐసీసీ బోర్డు ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎపెక్స్ బాడీ తెలిపింది. జింబాబ్వే క్రికెట్ బోర్డుపై అక్కడి ప్రభుత్వ జోక్యాన్ని నిరసిస్తూ ఐసీసీ ఈ చర్యలు తీసుకుంది. ప్రస్తుత బోర్డులోని సభ్యులను అక్కడి ప్రభుత్వ ఏజెన్సీ అయిన స్పోర్ట్స్ అండ్ రిక్రియేషన్ కమిటీ తొలగించింది. ఇది ఐసీసీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అవుతుందని ఐసీసీ పేర్కొంది.

ఐసీసీ తాజా నిర్ణయంతో జింబాబ్వే క్రికెట్ బోర్డుకు నిధులు ఆగిపోతాయి. అంతేకాక, ఇకపై ఐసీసీ నిర్వహించే ఏ టోర్నీలోనూ ఆ జట్టు ఆడేందుకు అవకాశం ఉండదు. క్రికెట్ బోర్డులో రాజకీయ జోక్యం లేకుండా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పిన ఐసీసీ.. మూడు నెలల్లో బోర్డు సభ్యలను తిరిగి నియమించాలని గడువు విధించింది.