cm: ఎస్సీ వర్గీకరణపై జగన్ చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి: మంద కృష్ణ మాదిగ డిమాండ్

  • దళితులను చీల్చడానికే అనడం కరెక్టు కాదు
  • ఇది రాజ్యాంగ విరుద్ధమనడం సబబు కాదు
  • గుంటూరు నుంచి అసెంబ్లీకి వర్గీకరణ సాధనయాత్ర చేపడతాం

ఎస్సీ వర్గీకరణ అంశంపై ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఖండించారు. గుంటూరులో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు చేసిన ఎస్సీ వర్గీకరణ తీర్మానం దళితులను చీల్చడానికేనని, ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ జగన్ వ్యాఖ్యానించడం తగదని అన్నారు. ఎస్సీ వర్గీకరణ  విషయంలో జగన్ మాట తప్పారని ఆరోపించారు.

వర్గీకరణపై ప్రధానికి జగన్ స్వయంగా లేఖ రాయడం, వైసీపీ ప్లీనరీలో తీర్మానం చేయడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. అసలు, ఎస్సీ వర్గీకరణను మొదట సమర్థించింది వైఎస్ రాజశేఖర్ రెడ్డేనని, ఆయన ఎంపీగా ఉన్న సమయంలో కమిషన్ వేయించారని గుర్తుచేశారు. జగన్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోని పక్షంలో గుంటూరు నుంచి అసెంబ్లీకి వర్గీకరణ సాధనయాత్ర చేపడతామని హెచ్చరించారు. ఎస్పీ వర్గీకరణపై పలు సందర్భాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ చేసిన వ్యాఖ్యలు, రాసిన లేఖలను ఈ యాత్ర ద్వారా ఆయనకు చూపిస్తామని చెప్పారు.

More Telugu News