ఇంగ్లాండ్ కు వరల్డ్ కప్ అందించిన కోచ్ ను లాగేసుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్

18-07-2019 Thu 17:34
  • బేలిస్ తో కాంట్రాక్టు ముగించిన ఇంగ్లాండ్
  • యాషెస్ సిరీస్ తర్వాత వీడ్కోలు
  • టామ్ మూడీ స్థానంలో సన్ రైజర్స్ కొత్త కోచ్ గా బేలిస్

క్రికెట్ కు పుట్టిల్లు ఇంగ్లాండ్ అయినా, నిన్నటి వరకు ఆ జట్టు ఖాతాలో ఓ ప్రపంచకప్ లేని వెలితి ఉండేది. ఇప్పుడా బాధ లేదు, సొంతగడ్డపై ఇంగ్లాండ్ వరల్డ్ చాంపియన్ గా నిలిచింది. ఈ విజయంలో కీలకపాత్ర ఆ జట్టు కోచ్ ట్రెవర్ బేలిస్ దనడంలో ఎలాంటి సందేహంలేదు. ఆటగాళ్లలో కసి రగల్చడంలో బేలిస్ తర్వాతే ఎవరైనా. యావరేజ్ జట్టుగా ఉన్న ఇంగ్లాండ్ ను వన్డేల్లో విధ్వంసక శక్తిగా మలిచాడు. ఇప్పుడు వరల్డ్ కప్ ముగియడంతో బేలిస్ తో ఇంగ్లాండ్ కాంట్రాక్టు కూడా ముగిసింది. ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీసే ఇంగ్లాండ్ కోచ్ గా బేలిస్ కు చివరి సిరీస్ కానుంది.

ఈ నేపథ్యంలో, ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్ రైజర్స్ హైదరాబాద్ అందరికంటే ముందే బేలిస్ ను దక్కించుకుంది. ఈ సూపర్ కోచ్ కోసం అంతర్జాతీయ జట్లు సైతం పోటీ పడుతున్న దశలో ఓ ఐపీఎల్ జట్టు బేలిస్ తో కాంట్రాక్టు కుదుర్చుకోవడం విశేషం అని చెప్పాలి. సన్ రైజర్స్ కు ఇప్పటివరకు టామ్ మూడీ కోచ్ గా వ్యవహరించాడు. మూడీతో కాంట్రాక్టు ముగియడంతో సన్ రైజర్స్ యాజమాన్యం ట్రెవర్ బేలిస్ ను హెడ్ కోచ్ గా టీమ్ లో భాగం చేసింది.

కోచ్ గా తిరుగులేని రికార్డు ఉన్న బేలిస్ గతంలో కోల్ కతా నైట్ రైడర్స్ కు కూడా కోచ్ గా వ్యవహరించాడు. ఆ సమయంలో కోల్ కతా రెండు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, అంతర్జాతీయ కోచ్ గా ఎంతో గొప్ప విజయాలు సాధించిన బేలిస్ ఆటగాడిగా ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు. ఆస్ట్రేలియాకి చెందిన బేలిస్ దేశవాళీ క్రికెట్ లో 58 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడాడు. అయితే అద్భుతమైన కోచింగ్ నైపుణ్యం బేలిస్ ను ప్రముఖ జట్లకు దగ్గర చేసింది.