Cricket: దినేశ్ కార్తీక్ కెరీర్ ముగిసినట్టే!.. శ్రేయాస్ అయ్యర్ పై కన్నేసిన సెలక్టర్లు!

  • వరల్డ్ కప్ లో విఫలమైన కార్తీక్
  • మరో చాన్స్ కష్టమేనంటున్న క్రికెట్ వర్గాలు
  • విండీస్-ఏ జట్టుపై అదరగొట్టిన శ్రేయాస్ అయ్యర్

వరల్డ్ కప్ లో ఒక్క మ్యాచ్ ఓటమితో టీమిండియా కథ ముగిసింది. సెమీఫైనల్లో న్యూజిలాండ్ తో ఓటమి భారత్ ను ఇంటిముఖం పట్టించింది. ఈ వైఫల్యంతో ధోనీ, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్ ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ధోనీ రిటైర్మెంటు ప్రకటిస్తాడో లేదో తెలియని అనిశ్చితి! కేదార్ జాదవ్ విండీస్ టూర్ కు ఎంపిక కావడం కష్టమే. ఇక మిగిలింది దినేశ్ కార్తీక్.

వరల్డ్ కప్ లో ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ కార్తీక్ తేలిపోయాడు. ఓ మ్యాచ్ లో 8, మరో మ్యాచ్ లో 6 పరుగులతో ఉసూరుమనిపించాడు. ఇప్పటికే అనేక చాన్సులు అందుకున్న డీకే, వరల్డ్ కప్ వైఫల్యంతో తన కెరీర్ ను తానే కష్టాల్లోకి నెట్టుకున్నాడు. సెలక్టర్లు మరోసారి డీకేపై కరుణ చూపుతారని భావించలేం. ఈ నేపథ్యంలో, విండీస్ టూర్ కు వెళ్లే భారత జట్టులోకి యువ బ్యాట్స్ మన్ శ్రేయాస్ అయ్యర్ ను ఎంపిక చేయాలని సెలక్టర్లు భావిస్తున్నట్టు సమాచారం.

ఇప్పటికే విండీస్-ఏ జట్టుతో కరీబియన్ గడ్డపై సిరీస్ ఆడుతున్న భారత్-ఏ జట్టులో అయ్యర్ సభ్యుడిగా ఉన్నాడు. ఈ వన్డే సిరీస్ లో మూడు మ్యాచ్ లు ఆడిన అయ్యర్ రెండు అర్థసెంచరీలతో ఆకట్టుకున్నాడు. అయ్యర్ అయితే నం.4 స్థానంలో అతికినట్టు సరిపోతాడన్నది సెలక్షన్ కమిటీ అభిప్రాయంగా తెలుస్తోంది.

More Telugu News