Andhra Pradesh: పులివెందుల తరహా పంచాయితీ ఇక్కడ చేయాలనుకుంటే కుదరదు!: టీడీపీ అధినేత చంద్రబాబు

  • 2018లో పవన విద్యుత్ ధరలపై పిటిషన్ వేశాం
  • 82 కంపెనీలు దానిపై కోర్టుకు వెళ్లాయి
  • అమరావతిలో మీడియాతో చంద్రబాబు

పవన విద్యుత్ ధరలు తగ్గించాలని తాము 2018లో కోర్టులో పిటిషన్ వేశామని టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు తెలిపారు. ఇందులో 82 పవన విద్యుత్ కంపెనీలను ప్రతివాదులుగా చేర్చామని చెప్పారు. అయితే తమ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఈ 82 పవన విద్యుత్ కంపెనీలు కోర్టుకు వెళ్లాయని గుర్తుచేశారు. విద్యుత్ పీపీఏ ఒప్పందాలపై ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏదేదో మాట్లాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చంద్రబాబు కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు.

అమరావతి పరిధిలో రూ.2 లక్షల కోట్ల విలువైన భూమి ఉందని చంద్రబాబు తెలిపారు. అయితే షేర్ మార్కెట్ తరహాలో ఇప్పుడు రాజధానిలో రియల్ ఎస్టేట్ రంగం కూడా పడిపోయిందని వ్యాఖ్యానించారు. రాజధానిలో కూలీలకు పని కూడా దొరకడం లేదని అన్నారు. బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడటం వంటివి సీఎం జగన్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఇలాంటి పులివెందుల పంచాయితీలు ఇక్కడ నడవవని స్పష్టం చేశారు. నిర్మాణాలు ఆగిపోవడంతో రాజధాని ప్రాంతంలోని చాలామంది కూలీలకు ఉపాధి దొరకడం లేదని చంద్రబాబు చెప్పారు.

More Telugu News