Bill GAtes: మారిన ప్రపంచ కుబేరుల జాబితా... మూడో స్థానానికి పడిపోయిన బిల్ గేట్స్!

  • రెండో స్థానంలో ఎల్వీఎంహెచ్‌ సీఈవో బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌
  • తొలి స్థానాన్ని నిలుపుకున్న జెఫ్ బెజోస్
  • ఇండియాలో అపర కుబేరుడు ముఖేష్ అంబానీయే

ప్రపంచ కుబేరుల జాబితాలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. తాజాగా బ్లూంబర్గ్ విడుదల చేసిన బిలియనీర్ ఇండెక్స్ లో బిల్ గేట్స్ ఒక స్థానం దిగజారారు. అత్యంత ధనవంతుడిగా అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ కొనసాగగా, రెండో స్థానంలోని బిల్ గేట్స్ కు షాకిస్తూ, ఎల్వీఎంహెచ్‌ సీఈవో బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ ద్వితీయ స్థానంలోకి వచ్చేశారు. గేట్స్ ఆస్తి ప్రస్తుతం 107 బిలియన్ డాలర్లు కాగా, బెర్నార్డ్ ఆర్నాల్ట్ 108 బిలియన్ డాలర్ల ఆస్తులతో ఉన్నారని బ్లూంబర్గ్ తెలిపింది.

కాగా, తన భార్యకు విడాకులు ఇచ్చిన తరువాత, భారీగా భరణం చెల్లించినా, బెజోస్ 125 బిలియన్ డాలర్ల ఆస్తులతో అగ్ర స్థానంలోనే ఉన్నారు. ఆయన భార్య 40.3 బిలియన్ డాలర్లతో మహిళా ధనవంతుల జాబితాలో నాలుగో స్థానంలో, మొత్తం మీద 22వ స్థానంలో ఉన్నారు. గేట్స్ తన సంపదలోని 35 బిలియన్ డాలర్లను గేట్స్ అండ్ మిలిందా ఫౌండేషన్ కు విరాళం ఇవ్వగా ఆయన ఆస్తి తగ్గిపోయింది. ఇక ఈ సంవత్సరం అత్యధికంగా సంపదను పెంచుకున్న వారిలోనూ ఆర్నాల్ట్ తొలి స్థానంలో ఉన్నారు.

ఇక భారత్ విషయానికి వస్తే, రిలయన్స్ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ తొలి స్థానాన్ని కొనసాగించారు. ఆయన సంపద మొత్తం 51.8 బిలియన్‌ డాలర్లు కాగా, ప్రపంచ వ్యాప్తంగా 13వ స్థానంలో అంబానీ ఉన్నారు. అంబానీ తరువాతి స్థానంలో విప్రో అధినేత అజీమ్‌ ప్రేమ్‌ జీ 20.5 బిలియన్‌ డాలర్లతో భారత కుబేరుల జాబితాలో సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే అజీమ్ ప్రేమ్ జీది 48వ ర్యాంకు. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్ చీఫ్ శివ నాడార్‌ 92వ స్థానంలో, కోటక్‌ మహీంద్రా ఎండీ ఉదయ్‌ కోటక్ 96వ స్థానంలో ఉన్నారని బ్లూంబర్గ్ పేర్కొంది.

More Telugu News