Sushma Swaraj: కుల్ భూషణ్ కేసును వాదించిన హరీశ్ సాల్వేపై సుష్మ స్వరాజ్ ప్రశంసలు

  • కుల్ భూషణ్ మరణశిక్షను నిలిపివేస్తూ ఐసీజే తీర్పు
  • సాల్వే ప్రభావవంతంగా వాదించారన్న సుష్మ
  • కేసును ముందుకు తీసుకెళ్లారంటూ ప్రధానికి కృతజ్ఞతలు చెప్పిన సుష్మ

మూడేళ్లుగా పాకిస్థాన్ చెరలో మగ్గిపోతున్న భారతీయుడు కుల్ భూషణ్ జాదవ్ మరణశిక్షను నిలిపివేస్తూ హేగ్ లోని అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీనిపై భారత విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మ స్వరాజ్ ట్విట్టర్ లో హర్షం వ్యక్తంచేశారు. భారత్ కు ఇదో గొప్ప విజయం అని పేర్కొన్నారు. కుల్ భూషణ్ జాదవ్ కేసును అంతర్జాతీయ న్యాయస్థానంలో హరీశ్ సాల్వే ప్రభావవంతంగా వాదించారని అభినందించారు. అంతర్జాతీయ వేదికపై భారత్ కు విజయం అందించినందుకు హరీశ్ సాల్వేకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు.

అంతేగాకుండా, జాదవ్ కేసును మరింత ముందుకు తీసుకెళ్లడంలో చొరవ చూపారంటూ ప్రధాని నరేంద్ర మోదీకి సుష్మ కృతజ్ఞతలు తెలిపారు. ఐసీజే తీర్పుతో భారత్ లో ఉన్న జాదవ్ కుటుంబానికి ఎంతో సాంత్వన చేకూరిందని సుష్మ అన్నారు. కాగా, ఈ కీలకమైన కేసులో కుల్ భూషణ్ తరఫున న్యాయవాదిగా వాదనలు వినిపించిన హరీశ్ సాల్వే కేవలం రూ.1 ఫీజుగా తీసుకున్నారు. 

More Telugu News