India: బ్రేకింగ్ న్యూస్: కుల్ భూషణ్ జాదవ్ మరణశిక్షను నిలిపివేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానం సంచలన తీర్పు

  • భారత్ కు అనుకూల తీర్పు ఇచ్చిన ఐసీజే 
  • అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్ కు భారీవిజయం
  • పాకిస్థాన్ కు చెంపపెట్టు

భారత్ కు చెందిన కుల్ భూషణ్ జాదవ్ కు పాకిస్థాన్ విధించిన మరణశిక్షను నిలిపివేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానం (ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్-ఐసీజే) సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో పాకిస్థాన్ పునఃసమీక్ష చేసే వరకు కుల్ భూషణ్ మరణశిక్ష అమలుపై స్టే విధించింది. కేసు విచారణలో మొత్తం 16 మంది న్యాయమూర్తుల్లో 15 మంది భారత్ వాదనలకు మద్దతు పలికినట్టు తెలుస్తోంది. ఐసీజేలో భారత్ కు అనుకూల తీర్పు రావడం పట్ల కేంద్ర వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇప్పటికే దౌత్య పరమైన మార్గాల్లోనూ పాకిస్థాన్ పై పైచేయి సాధించిన భారత్, ఇప్పుడు న్యాయపరంగానూ విజయం సాధించినట్టయింది.

భారత గూఢచార సంస్థ 'రా' కోసం తమ దేశంలో గూఢచర్యానికి పాల్పడ్డాడంటూ కుల్ భూషణ్ ను 2016 మార్చి 3న పాకిస్థాన్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 2017లో పాక్ మిలిటరీ కోర్టు ఏకపక్ష విచారణ జరిపి కుల్ భూషణ్ కు మరణశిక్ష విధించింది. దీనిపై భారత్ నెదర్లాండ్స్ లోని 'ద హేగ్'లో ఉన్న అంతర్జాతీయ న్యాయస్థానంలో సవాల్ చేసింది. దీనిపై విచారణలో భాగంగానే తాజా తీర్పు వెలువడింది. అంతర్జాతీయంగా భారత్ కు ఇది భారీ విజయం అని చెప్పాలి. మరోవైపు భారత్ ను అంతర్జాతీయంగా అప్రదిష్ఠపాల్జేయాలని చూస్తున్న పాక్ కు ఇది గట్టి ఎదురుదెబ్బ అని భావించాలి.

More Telugu News