jarkhand: ఇస్లాంకు వ్యతిరేకంగా ఫేస్ బుక్ లో పోస్ట్.. 5 ఖురాన్ కాపీలు పంచాలని యువతికి కోర్టు ఆదేశం!

  • జార్ఖండ్ లోని రాంచీలో ఘటన
  • ముస్లింలకు వ్యతిరేకంగా పోస్ట్ షేర్ చేసిన యువతి
  • ఖురాన్ కాపీలను పంచాలని కోర్టు ఆదేశం

కోర్టులు కొన్నికొన్ని సార్లు ఇచ్చే ఆదేశాలు అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తాయి. తాజాగా అలాంటి ఘటనే జార్ఖండ్ రాజధాని రాంచీలో చోటుచేసుకుంది. రాంచీకి చెందిన రిచా భారతి(19) అనే యువతి ఇటీవల ఇస్లాం, ముస్లింలకు వ్యతిరేకంగా ఫేస్ బుక్ లో ఓ వివాదాస్పద పోస్ట్ ను షేర్ చేసింది. దీన్ని గమనించిన అంజుమన్ కమిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ కేసును విచారించిన రాంచీలోని ఓ కోర్టు రిచా భారతికి బెయిల్ మంజూరు చేసింది.

ఈ సందర్భంగా రిచా భారతికి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు ఓ షరతు విధించింది. నిందితురాలు ఐదు ఖురాన్ ప్రతులను పంచాలని న్యాయస్థానం ఆదేశించింది. పిటిషనర్ అంజుమన్ కమిటీతో పాటు నగరంలోని గ్రంథాలయాలకు దీన్ని అందజేయాలని సూచించింది. ఇలా పంచినట్లు తమకు సాక్ష్యాలు సమర్పించాలని స్పష్టం చేసింది. కాగా, బెయిల్ అనంతరం భారతి మాట్లాడుతూ.. తాను ఏ తప్పూ చేయలేదనీ, తనకు వచ్చిన సందేశాన్ని షేర్ చేశానని తెలిపారు. అవసరమైతే ఈ విషయంలో హైకోర్టుకు వెళతానని తేల్చిచెప్పారు.

More Telugu News