Telangana: ఉద్యమ నాయకుడు సీఎం అయితే జరిగే లబ్ధి ఇదే!: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

  • మేడిగడ్డ బ్యారేజ్ లోకి 11టీఎంసీలు లిఫ్ట్ చేశాం
  • దీనిద్వారా లక్షన్నర ఎకరాలకు నీటిని అందించొచ్చు
  • ట్విట్టర్ లో స్పందించిన టీఆర్ఎస్ నేత

తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ పై స్పందించారు. ప్రస్తుతం తక్కువ వర్షాలు పడుతున్నప్పటికీ, గోదావరిలో ఏమాత్రం వరదరాని సీజన్ లో కూడా ప్రాణహిత నదిలో వస్తున్న వరదనీటిని 5 మోటార్ల ద్వారా లిఫ్ట్ చేశామని తెలిపారు. దీనిద్వారా గత 10 రోజుల్లో 11 టీఎంసీల నీటిని ఒడిసిపట్టి నిల్వచేశామని అన్నారు.

ఈ నీటితో కనీసం లక్షన్నర ఎకరాలకు సాగునీటిని అందించవచ్చని వ్యాఖ్యానించారు. ఇది ప్రారంభం మాత్రమేననీ, వర్షాలు కురిసి, వరద పెరిగి అన్ని మోటార్లు మొదలైతే రాష్ట్రంలోని బీళ్లన్నీ గోదావరి నీటితో సస్యశ్యామలం అవుతాయని వ్యాఖ్యానించారు. ఉద్యమ నాయకుడే(కేసీఆర్) ముఖ్యమంత్రి అవడం వల్ల తెలంగాణకు ఈ లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు. ఈ మేరకు కేటీఆర్ వరుస ట్వీట్లు చేశారు.

More Telugu News