mamata banerjee: వార్షికాదాయం రూ.8 లక్షల లోపున్న వారికి మమత సర్కారు తీపి కబురు

  • రాష్ట్ర ప్రజలపై మమత వరాల జల్లు
  • ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో పది శాతం రిజర్వేషన్
  • వారం రోజుల్లోపే రెండో ప్రకటన

వార్షిక ఆదాయం రూ. 8 లక్షల లోపు ఉన్న కుటుంబాలకు పశ్చిమ బెంగాల్‌లోని మమత బెనర్జీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి పదిశాతం రిజర్వేషన్ కల్పించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం ప్రస్తుతం రిజర్వేషన్లు అనుభవిస్తున్న షెడ్యూల్డ్ కులం, షెడ్యూల్డ్ తెగ, ఇతర వెనుకబడిన తరగతులకు చెందని వారికి మాత్రమే ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది. పౌర పోస్టులలో వీరికి నేరుగా పదిశాతం రిజర్వేషన్ లభిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. అలాగే, రాష్ట్రంలోని విద్యాసంస్థల్లోనూ వీరికి ఈ మొత్తంలో రిజర్వేషన్ లభిస్తుందని స్పష్టం చేసింది.

అయితే, వార్షిక ఆదాయం మాత్రం 8 లక్షల లోపు ఉండాల్సిందేనని నిబంధన విధించింది. అన్ని రకాలుగా వచ్చే ఆదాయం అంటే వేతనం, వ్యవసాయం, వ్యాపారం, వృత్తి.. తదితర వాటిపై వచ్చే మొత్తం కలిపినా రూ. 8 లక్షలు దాటని వారే ఇందుకు అర్హులని తెలిపింది. కాగా, అంతకుముందే మమత ప్రభుత్వం జనరల్ కేటగిరీలో ఉన్న ఆర్థికంగా వెనకబడిన వారికి (ఈడబ్ల్యూఎస్) ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో పదిశాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. అంతలోనే మరో ప్రకటన విడుదల చేయడం గమనార్హం.

More Telugu News