భారత్ లో కియా సెల్టోస్ కారు బుకింగ్స్ ప్రారంభం

16-07-2019 Tue 21:34
  • అనంతపురం జిల్లాలో కియా కార్ల తయారీ
  • ఆగస్టు 22న మార్కెట్లోకి రానున్న కియా సెల్టోస్
  • ఆన్ లైన్, సేల్స్ పాయింట్ల నుంచి బుక్ చేసుకునే అవకాశం

ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా పెనుకొండలో కార్ల తయారీ ప్లాంట్ స్థాపించిన అంతర్జాతీయ కార్ల దిగ్గజం కియా నుంచి తొలికారు రాబోతోంది. కియా సెల్టోస్ పేరిట రూపుదిద్దుకున్న ఈ కొత్త కారు బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కియా సెల్టోస్ ఆగస్టు 22న మార్కెట్లోకి రానుంది. ఆన్ లైన్లో కానీ, సేల్స్ సెంటర్ల నుంచి కానీ బుక్ చేసుకోవచ్చు. ప్రాథమికంగా రూ.25,000 చెల్లించి కారును బుక్ చేసుకోవచ్చని కియా ప్రతినిధులు చెబుతున్నారు. ఎస్ యూవీ సెగ్మెంట్లో వస్తున్న కియా సెల్టోస్ ప్రధానంగా రెండు వెర్షన్లలో లభ్యం కానుంది. పెర్ఫార్మెన్స్ కోరుకునేవాళ్ల కోసం జీటీ లైన్, కుటుంబ ప్రయాణాల కోసం టెక్ లైన్ మోడళ్లలో రానుంది. పెట్రోల్, టర్బో పెట్రోల్, డీజిల్ వేరియంట్లతో వస్తున్న సెల్టోస్ ను బీఎస్ 6 ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించారు. దీని ధర విషయానికొస్తే, రూ.11 నుంచి రూ.17 లక్షల మధ్యలో ఉండే అవకాశాలున్నాయి.