Andhra Pradesh: పిల్లల సంఖ్యతో సంబంధంలేదు... తల్లికి మాత్రమే రూ.15 వేలు: అమ్మ ఒడిపై క్లారిటీ ఇచ్చిన మంత్రి

  • రాష్ట్రంలో 43 లక్షల మందికి అమ్మ ఒడి వర్తింపు
  • 82 లక్షల మంది విద్యార్థులున్నారన్న టీడీపీ సభ్యులు
  • తల్లిని దృష్టిలో పెట్టుకునే తాము పథకానికి రూపకల్పన చేశామన్న మంత్రి

ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ 'అమ్మ ఒడి' పథకంపై నెలకొన్న గందరగోళాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. శాసనసభలో ఆయన ఈ పథకానికి సంబంధించిన వివరాలు తెలిపారు. ప్రభుత్వం 43 లక్షల మందికే 'అమ్మ ఒడి' వర్తింపచేస్తున్నట్టు ప్రకటించిందని, రాష్ట్రంలో 82 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని టీడీపీ సభ్యులు ప్రశ్నించారు. అందుకు మంత్రి ఆదిమూలపు బదులిస్తూ, పిల్లల్ని చదివిస్తున్న తల్లిని దృష్టిలో పెట్టుకునే తాము 'అమ్మ ఒడి' పథకానికి రూపకల్పన చేశామని, పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా తల్లికి మాత్రమే రూ.15 వేలు ఇస్తున్నట్టు వెల్లడించారు. అంతకుముందు రాష్ట్ర బడ్జెట్ లో కూడా ఏపీ సర్కారు ఇదే విషయాన్ని తెలిపింది. ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నా ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని తాజాగా మంత్రి వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోంది. 'అమ్మ ఒడి' పథకం అమలు కోసం బడ్జెట్ లో రూ.6,455.80 కోట్లు కేటాయించారు.

More Telugu News