Motor Vehicle Act: వాహన చట్టానికి సవరణలు... లైసెన్స్ లేకుంటే రూ. 5 వేల జరిమానా!

  • భారీగా పెరిగిన జరిమానాలు
  • మైనర్ కు వాహనం ఇస్తే రూ. 25 వేల ఫైన్
  • డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడితే రూ. 10 వేలు
  • అంబులెన్స్ కు దారివ్వకుంటే 10 వేలు కట్టాల్సిందే

ఇకపై ఏదైనా అంబులెన్స్ వస్తుంటే దానికి దారి ఇవ్వకుంటే రూ. 10 వేలు జరిమానాగా చెల్లించాలి. ఇక లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడిపితే రూ. 5 వేలు కట్టాల్సిందే. మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లు 2019 గురించి కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, భారీ జరిమానాలు సబబేనని, దీనివల్ల ప్రమాదాల సంఖ్య తగ్గుతుందని అన్నారు.

ఈ కొత్త బిల్లును పరిశీలిస్తే, అత్యవసర వాహనాలకు తప్పనిసరిగా దారి ఇవ్వాల్సిందే. ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘనలపై ప్రస్తుతం రూ. 100గా ఉన్న జరిమానా, ఇకపై రూ. 500కు పెరగనుంది. పోలీసులు వాహనాలను ఆపాలని కోరినప్పుడు ఆపకుండా వెళితే రూ. 2 వేలు పెనాల్టీ పడుతుంది. లైసెన్స్ ను ఇంటి దగ్గర మరచి డ్రైవింగ్ చేస్తున్నా భారీ జరిమానా తప్పదు. ఇంటి వద్ద లైసెన్స్ ఉంచి వాహనంతో రోడ్డుపైకి వచ్చి చిక్కితే రూ. 5 వేలు, బీమా ఉండి కూడా దాని నకలు లేకుండా నడిపితే రూ. 2 వేల ఫైన్ పడుతుంది.

ఇక ఓవర్ స్పీడ్ గా నడిపితే రూ. 1000 నుంచి రూ. 2 వేలు, సీట్ బెల్ట్ లేకుంటే రూ. 1000 జరిమానా చెల్లించుకోవాల్సిందే. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాన్ని నడిపితే రూ. 1000, మైనర్లకు వాహనాన్ని ఇస్తే, వాహన యజమాని లేదా గార్డియన్ పై రూ. 25 వేల జరిమానాతో పాటు మూడేళ్ల జైలుశిక్ష తప్పదు. ఇదే సమయంలో వాహన రిజిస్ట్రేషన్ కూడా రద్దు అవుతుంది. వాహనాలను ఓవర్ లోడ్ చేస్తే రూ. 20 వేలు, ర్యాష్ డ్రైవింగ్ కు రూ. 5 వేలు, మందు కొట్టి వాహనం నడిపితే రూ. 10 వేలు ఫైన్ విధించేలా కొత్త చట్టంలో నిబంధనలను పొందుపరిచారు.

More Telugu News