BCCI: రవిశాస్త్రికి ఉద్వాసన... కోచ్ వేటలో బీసీసీఐ!

  • వరల్డ్ కప్ తో ముగిసిన రవిశాస్త్రి కాంట్రాక్ట్ 
  • వెస్టిండీస్ టూర్ వరకూ పొడిగింపు
  • ఆపై కొత్త కోచ్, సహాయకుల ఎంపిక

భారత క్రికెట్ జట్టుకు త్వరలో ప్రధాన కోచ్‌ మారనున్నాడు. ప్రస్తుతం రవిశాస్త్రి కోచ్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కోచ్ తో పాటు సహాయ సిబ్బంది నియామకం కోసం త్వరలోనే బీసీసీఐ ఓ ప్రకటన విడుదల చేయనుంది. వచ్చే నెలలో వెస్టిండీస్‌ కు భారత క్రికెట్ జట్టు పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ తో రవిశాస్త్రి పదవీకాలం ముగిసినా, వెస్టిండీస్ తో టూర్ నేపథ్యంలో కాంట్రాక్ట్ ను 45 రోజుల పాటు పొడిగించారు.

ఇక వరల్డ్ కప్ లో సెమీస్ లోనే భారత్ నిష్క్రమించిన నేపథ్యంలో, రవిశాస్త్రికి మరో అవకాశంగానీ, మరోమారు పదవీకాలం పొడిగింపుగానీ ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. రవిశాస్త్రితో పాటు బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌, బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ లతో పాటు, ఫీల్డింగ్‌ కోచ్‌ శ్రీధర్‌ ల స్థానంలోనూ కొత్తవారు రానున్నారు. వరల్డ్‌ కప్‌ వైఫల్యం తరువాత జట్టు ఫిజియో ప్యాట్రిక్‌ ఫర్హాత్‌, ట్రైనర్‌ శంకర్‌ బసులు ఇప్పటికే తమ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. వెస్టిండీస్ పర్యటన తరువాత, సెప్టెంబరు 15 నుంచి స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగే పోటీల సమయానికి కొత్త కోచ్, అతని సహాయకుల ఎంపిక పూర్తి చేయాలని బీసీసీఐ భావిస్తోంది.

More Telugu News