Congress: బెంగళూరు విమానాశ్రయంలో మిడ్‌నైట్ డ్రామా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రోషన్ బేగ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

  • ఐఎంఏ పోంజీ కుంభకోణంలో బేగ్‌పై ఆరోపణలు
  • ఈ నెల 19న సిట్ ఎదుట హాజరు కావాల్సిన రోషన్ బేగ్
  • బీజేపీపై విరుచుకుపడిన ముఖ్యమంత్రి కుమారస్వామి

పోంజీ కుంభకోణం కేసులో కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే రోషన్ బేగ్‌ను సోమవారం రాత్రి కర్ణాటక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే చార్టెర్డ్ విమానమెక్కిన ఆయనను కిందికి దించారు. ఓసారి ఢిల్లీ వెళ్తున్నానని, మరోసారి పూణె వెళ్తున్నానంటూ పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఫ్లైట్ డిటైల్స్ ప్రకారం బేగ్ పూణె వెళ్తున్నట్టు తేలిందని పోలీసులు పేర్కొన్నారు.

ఐఎంఏ పోంజీ స్కీం కేసులో ఈ నెల 19న తమ ముందు హాజరు కావాల్సిందిగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్.. బేగ్‌కు నోటీసులు ఇచ్చింది. అయితే, గుర్తు తెలియని ప్రదేశానికి ఆయన పారిపోయేందుకు ప్రయత్నిస్తుండడంతో అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొంది. ఆయనను అరెస్ట్ చేయాలా? వద్దా? అనే విషయాన్ని బేగ్‌ను ప్రశ్నించిన తర్వాతే నిర్ణయిస్తామన్నారు.

కాగా, బేగ్‌ను అదుపులోకి తీసుకోవడంపై కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి స్పందించారు. ఇది బీజేపీ పనేనని ఆరోపించారు. రోషన్ బేగ్‌తోపాటు యడ్యూరప్ప పీఏ సంతోష్ కూడా ఆ విమానంలో ఉన్నారని కానీ, రోషన్ బేగ్‌ను పట్టుకున్న సిట్ సంతోష్‌ను మాత్రం వదిలేసిందని ఆరోపించారు.

బీజేపీ ఎమ్మెల్యే యోగేశ్వర్ కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నారని, ఐఎంఏ కేసులో మాజీ మంత్రిని తప్పించేందుకు కర్ణాటక బీజేపీ ప్రయత్నించడం సిగ్గు చేటని కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని బట్టి చూస్తుంటే తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ బేరసారాలు చేస్తున్న విషయం స్పష్టంగా అర్థమవుతోందని ముఖ్యమంత్రి ఆరోపించారు.

More Telugu News