Pakistan: గగనతలాన్ని తెరిచిన పాకిస్థాన్.. పౌర విమానాలకు అనుమతి

  • బాలాకోట్ దాడుల తర్వాత గగనతలాన్ని మూసివేసిన పాక్
  • ఏప్రిల్‌లో ఒకే ఒక్క మార్గాన్ని తెరిచిన పాక్
  • వాణిజ్య విమానాలకు మాత్రం అనుమతి నిరాకరణ

బాలాకోట్ ఉగ్రస్థావరాలపై భారత వాయుసేన దాడుల తర్వాత తమ గగనతలాన్ని మూసేసిన పాక్ తాజాగా తెరిచినట్టు ప్రకటించింది. తమ గగనతలం మీదుగా అన్ని పౌరవిమానాల రాకపోకలకు అనుమతి ఇస్తున్నట్టు పాకిస్థాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ పేర్కొంది. తక్షణమే ఇది అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. కాగా, తమ ఎయిర్‌బేస్‌ల నుంచి భారత్ జెట్ యుద్ధ విమానాలను ఉపసంహరించుకునే వరకు వాణిజ్య విమానాలకు అనుమతి ఇవ్వబోమని అంతకుముందు పాక్ ప్రకటించింది.

పుల్వామా దాడికి ప్రతీకారంగా నియంత్రణ రేఖకు ఆవల బాలాకోట్‌లో ఉన్న జైషే ఉగ్రవాద శిక్షణ శిబిరాలపై ఫిబ్రవరి 26న భారత వాయుసేన దాడులు చేసింది. ఈ దాడి తర్వాత పాక్ తన గగనతలాన్ని పూర్తిగా మూసివేసింది. ఆ తర్వాత ఏప్రిల్‌లో మూసివేసిన 11 వాయుమార్గాల్లో ఒక దానిని తెరిచింది. మార్చిలో పాక్షికంగా వాయుమార్గాలను తెరిచినప్పటికీ భారత విమానాలను అనుమతించలేదు. తాజాగా, అన్ని మార్గాలను తెరిచినట్టు ప్రకటించింది.

More Telugu News