Telugudesam: పార్టీ భవిష్యత్ కోసం కేశినేని, బుద్ధా మాట్లాడకుండా ఉంటే మంచిది: టీడీపీ నేత బండారు

  • వీరి వివాదం పూర్తిగా టీడీపీ అంతర్గత వ్యవహారం
  • ఫిరాయింపుదారులతో టీడీపీకి ప్రమాదమేమీ లేదు
  • సంఖ్యాబలంలో మార్పు రావచ్చు.. పార్టీ బలంలో కాదు 

కొన్ని రోజులుగా టీడీపీ నేతలు కేశినేని నాని, బుద్ధా వెంకన్నల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం తెలిసిందే. సొంత పార్టీ నేతలే ఇలా పరస్పర విమర్శలు, ఆరోపణలు చేసుకోవడంపై ఇప్పటికే పార్టీ అధిష్ఠానం హెచ్చరించింది. ఇక, వీళ్లిద్దరి వ్యాఖ్యలపై టీడీపీలోని పలువురు నేతలు పెదవి విరుస్తున్నారు.

తాజాగా, టీడీపీ నేత బండారు సత్యనారాయణ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, పార్టీ భవిష్యత్ కోసం కేశినేని నాని, బుద్ధా వెంకన్నలు మాట్లాడకుండా ఉంటే మంచిదని సూచించారు. వీరి వివాదం పూర్తిగా టీడీపీ అంతర్గత వ్యవహారంగా భావించారు.

పార్టీని వీడుతున్న నేతల గురించి బండారు ప్రస్తావిస్తూ, సంఖ్యాబలంలో మార్పు రావచ్చేమోగానీ, పార్టీ బలంలో ఏమాత్రం మార్పు రాదని, అంతే బలంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. టీడీపీని వీడి ఎంత మంది వెళ్లినా పార్టీ పునాదులకు ఎటువంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. పార్టీపై చంద్రబాబు పట్టుకోల్పోయాన్న ప్రశ్నకు బండారు స్పందిస్తూ, పార్టీపై ఆయన పట్టుకోల్పోవడం అన్నది  ఎప్పుడూ జరగలేదని, అలా జరగదు కూడా అని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ మీద, కార్యకర్తల మీద చంద్రబాబుకు పూర్తి పట్టు ఉందని అన్నారు. టీడీపీని వీడిన నేతలు ఇప్పుడు విమర్శలు చేయడం సబబు కాదని హితవు పలికారు. తమ నేతల్లోనే భిన్నాభిప్రాయాలు ఉంటున్నాయని, పార్టీలో కచ్చితంగా తప్పు జరిగింది కనుకనే మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయామని సంచలన వ్యాఖ్యలు చేశారు.

More Telugu News