Buggana: కియా కంపెనీ ప్రతినిధులతో వైఎస్ కలలో చెప్పారేమో..!: అచ్చెన్నాయుడు ఎద్దేవా

  • చిన్న పిల్లాడిని అడిగినా కూడా చెబుతాడు
  • బెదిరింపుల వల్ల పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు
  • పరిశ్రమలన్నీ ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయి

వైఎస్ కారణంగానే కియా కంపెనీ వచ్చిందంటూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అసలు బుగ్గన మతి ఉండే మాట్లాడుతున్నారో, లేదోనంటూ విరుచుకుపడ్డారు. చిన్న పిల్లాడిని అడిగినా కూడా కియా కంపెనీ టీడీపీ ప్రభుత్వం వల్లే వచ్చిందని చెబుతాడని, అలాంటిది బుగ్గన కియాపై వక్రభాష్యం చెబుతున్నారని ధ్వజమెత్తారు. 2009లో మరణించిన వైఎస్ చెబితే 2017లో కియా కంపెనీ వచ్చిందా? అని మండిపడ్డారు. వైఎస్ కలలో కియా కంపెనీ ప్రతినిధులకు చెప్పి ఉంటారంటూ అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

వైసీపీ నేతల బెదిరింపుల కారణంగా పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారని, పరిశ్రమలన్నీ ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయన్నారు. కియా అనుబంధ సంస్థలు ఏర్పాటు చేసే స్థలంలో గతంలో ఎకరం 6 లక్షలున్న పొలం ప్రస్తుతం 60 లక్షలు అయిందన్నారు. టీడీపీ ప్రభుత్వ లబ్దిదారుల స్పందనను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు సీఎం జగన్ ఏ ఊరు అయినా ఎంచుకోవచ్చని, అవసరమైతే తానూ వస్తానన్నారు.

ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు స్పీకర్ తమ్మినేని సీతారాంపై సైతం తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. స్పీకర్ మాటలకు, చేతలకు సంబంధం ఉండట్లేదని, టీడీపీకి మాట్లాడే అవకాశమే ఇవ్వట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ తమకు మాట్లాడే అవకాశం వస్తే ప్రభుత్వం సభ నుంచి పారిపోతోందంటూ అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు.

More Telugu News