bihar: 'సూపర్‌-30' ఆనంద్ కుమార్‌ను కలసిన పారిశ్రామిక దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా

  • స్వయంగా కలిసి ప్రశంసలు
  • విద్యార్థులకు మీ సేవలు అమూల్యమంటూ కితాబు
  • ఆర్థిక సాయం చేస్తానంటే తిరస్కరించిన గణిత మేధావి

సూపర్‌-30 చిత్రం విడుదలతో బీహార్‌కు చెందిన గణిత మేధావి ఆనంద్‌కుమార్‌ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. ఏటా ప్రతిభావంతులైన 30 మంది నిరుపేద విద్యార్థులకు తన సొంత ఖర్చుతో ఐఐటీ శిక్షణ అందజేస్తూ వారి ఉన్నత భవిష్యత్తుకు బాటలు వేస్తున్న ఆనంద్‌కుమార్‌ ఇప్పుడో రియల్ హీరో. ఈ ఐఐటీ ట్యూటర్‌ జీవితం ఆధారంగా హృతిక్‌ రోషన్‌ ప్రధాన పాత్రధారిగా బాలీవుడ్ లో తెరకెక్కిన ‘సూపర్‌-30’ చిత్రం  కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఆనంద్‌ కుమార్‌ చేస్తున్న విద్యా సేవల గురించి తెలుసుకున్న పారిశ్రామిక దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా స్వయంగా ఆయనను కలిసి అభినందించారు. ఈ సందర్భంగా ఆనంద్‌కుమార్‌తో దిగిన ఫొటోను ట్విట్టర్‌లో ఉంచారు.

‘ఆనంద్‌కుమార్‌ చేస్తున్న కృషిని చూసి ఆయనను అభినందించడానికి వెళ్లాను. నా వంతుగా ఆయనకు ఆర్థిక సాయం చేద్దామని భావించాను. కానీ ఆశ్చర్యం. నా సాయాన్ని ఆయన మర్యాదపూర్వకంగా తిరస్కరించారు. తన సూపర్‌-30 కార్యక్రమాన్ని తన సొంత నిధులతో చేపట్టాలనుకుంటున్నట్టు వినమ్రంగా తెలిపారు. ఆయన కృషిని అభినందిస్తున్నాను’ అంటూ ట్వీట్‌ చేశారు.

ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌పై ఆనంద్‌కుమార్‌ స్పందిస్తూ 'మీ అభినందనలే నాకు ఎంతో బలాన్నిస్తాయి. మీ అభిమానానికి ధన్యవాదాలు సార్’ అంటూ రీ ట్వీట్‌ చేశారు.

More Telugu News