Ben stokes: ప్రపంచకప్‌లో విచిత్రం.. న్యూజిలాండ్‌ను ఓడించిన స్టోక్స్ న్యూజిలాండ్ వాసే!

  • బెన్ స్టోక్స్ పుట్టింది న్యూజిలాండ్‌లోనే
  • ఫైనల్‌లో కివీస్‌కు కొరకరాని కొయ్యగా మారిన వైనం
  • మ్యాన్ ఆఫ్ ద ఫైనల్ అందుకున్న తొలి ఇంగ్లండ్ ఆటగాడిగా రికార్డు

ప్రపంచకప్‌లో దీనినో విచిత్రంగానే చెప్పుకోవాలి. ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌లో ఇంగ్లండ్ విజయం సాధించింది. చివరి బంతి వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను టెన్షన్ లో పెట్టిన ఈ మ్యాచ్ ఫలితం చివరికి సూపర్ ఓవర్‌లో కానీ తేలలేదు. నిజానికి ఈ మ్యాచ్ ఫలితం తొలి నుంచి న్యూజిలాండ్‌వైపే మొగ్గింది. చివరి ఓవర్ వరకు న్యూజిలాండ్‌దే విజయమని అందరూ భావించారు. అయితే, ఇంగ్లండ్ ఆటగాడు బెన్ స్టోక్స్ కివీస్ బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారి విజయంలో కీలక పాత్ర పోషించాడు. 84 పరుగులతో నాటౌట్‌గా నిలిచి దశాబ్దాల ఇంగ్లండ్ కలను నెరవేర్చాడు. ‘మ్యాన్ ఆఫ్ ది ఫైనల్’గా ఎంపికయ్యాడు.

అయితే, ఈ మ్యాచ్‌కో ప్రత్యేకత ఉంది. న్యూజిలాండ్‌కు ముచ్చెమటలు పట్టించి ఇంగ్లండ్ ప్రపంచకప్ కలను సాకారం చేసిన బెన్ స్టోక్స్ పుట్టింది న్యూజిలాండ్‌లో కావడం విశేషం. 28 ఏళ్ల స్టోక్స్ ఆ దేశంలోని క్రైస్ట్‌చర్చ్‌లో జన్మించాడు. ప్రపంచకప్ పైనల్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకుని ఆ ఘనత సాధించిన తొలి క్రికెటర్ అయ్యాడు. ఇక, ఫలితం కోసం నిర్వహించిన సూపర్ ఓవర్‌లో ఇంగ్లండ్ 15 పరుగులు చేయగా, అందులో బెన్ స్టోక్స్ 8 పరుగులు చేయడం విశేషం.

More Telugu News