Andhra Pradesh: ప్రధాని సీట్లో జగన్, చంద్రబాబు కూర్చున్నా ప్రత్యేక హోదా రాదు: బీజేపీ నేత సుజనా చౌదరి

  • గతంలో టీడీపీతో కలవడం వల్లే ఏపీలో బీజేపీకి నష్టం
  • ఏపీకి కేంద్రం అన్యాయం చేయలేదు
  • చరిత్రలు తవ్వి గత ప్రభుత్వాలను ఇబ్బందిపెట్టొద్దు 

ఏపీకి ప్రత్యేకహోదా రాదని బీజేపీ నేత సుజనా చౌదరి మరోసారి స్పష్టం చేశారు. ఎవరు ఏం చేసినా ఏపీకి ప్రత్యేక హోదా రాదని, అది ముగిసిన అధ్యాయంగా ఆయన అభివర్ణించారు. ప్రధానమంత్రి సీట్లో జగన్, చంద్రబాబు కూర్చున్నా సరే ఏపీకి ఈ ‘హోదా’ రాదని అన్నారు. ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందంటూ వస్తున్న విమర్శలపై ఆయన స్పందిస్తూ, రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేయలేదని బల్లగుద్ది చెప్పగలనని అన్నారు. చరిత్రలు తవ్వి గత ప్రభుత్వాలను ఇబ్బందిపెట్టడం జగన్ కు మంచిది కాదని హితవు పలికారు. గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందన్న ఫిర్యాదులు కనుక ఉంటే వాటిపై విచారణ జరపవచ్చని సూచించారు.

గతంలో టీడీపీతో కలవడం వల్లే ఏపీలో బీజేపీకి నష్టం జరిగిందని వ్యాఖ్యానించారు. బీజేపీకి రాష్ట్రంలో అన్ని పార్టీలు ప్రత్యర్థి పార్టీలేనని అన్నారు. తనకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎన్టీఆర్ చిత్రాన్ని ఉంచడాన్ని స్వాగతిస్తున్నానని అన్నారు. కాగా, గుంటూరులో బీజేపీ  పదాధికారుల సమావేశం ఈరోజు జరిగింది. ఈ సమావేశంలో పాల్గొనే నిమిత్తం సుజనా చౌదరి ఇక్కడికి వచ్చారు.  

More Telugu News