ISRO: చంద్రయాన్-2లో అతివలే అద్భుత రూపకర్తలు!

  • చంద్రుడి పైకి స్పేస్ క్రాఫ్టు పంపుతున్న ఇస్రో
  • కీలక బాధ్యతలు మోస్తున్న వనితా, రితు  
  • గతంలోనూ విజయవంతమైన మహిళా శాస్త్రవేత్తలు

భారత అంతరిక్ష చరిత్రలో తొలిసారిగా మహిళలే కీలకపాత్ర పోషిస్తున్న బృహత్తర ప్రాజక్టుగా చంద్రయాన్-2 గురించి చెప్పాలి. చంద్ర మండలంపై ఇప్పటివరకు ఎవరూ అడుగుపెట్టని ప్రాంతంలో పరిశోధనలు సాగించేందుకు ఉద్దేశించిన ఈ ప్రాజక్టులో ఇద్దరు మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. చంద్రయాన్-2 ప్రాజక్టు డైరక్టర్ గా వనితా ముత్తయ్య, మిషన్ డైరక్టర్ గా రితు కరిధాల్ తమ శక్తిసామర్థ్యాలను చాటుతున్నారు. వనిత గురించి చెప్పాల్సివస్తే, డేటాను సమన్వయం చేయడంలో ఆమెది అందెవేసిన చేయి. సమస్యల్ని పరిష్కరించడంలో, శాస్త్రవేత్తల బృందాలను సమర్థంగా నడిపించడంలో వనిత అత్యంత నేర్పరి. గతంలో చంద్రయాన్-1 ప్రాజక్టు ద్వారా అందిన సమాచారాన్ని విశ్లేషించడంలో వనితానే ముఖ్యభూమిక పోషించారు.

ఇక, రితు కరిధాల్ కూడా తక్కువేమీ కాదు. అంగారకుడిపై పరిశోధనలకు ఉద్దేశించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) లో డిప్యూటీ ఆపరేషన్స్ డైరక్టర్ గా విజయవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు. అంతేకాదు, గతంలో ఇస్రో చేపట్టిన అనేక కార్యక్రమాల్లో రితు విశేషంగా సేవలిందించారు. ప్రస్తుతం చంద్రయాన్-2 ప్రాజక్టులో ప్రధాన స్పేస్ క్రాఫ్టును చంద్రుడి కక్ష్యలో గురితప్పకుండా ప్రవేశపెట్టడం రితు భుజస్కంధాలపైనే ఉంది.

More Telugu News