Madhya Pradesh: 20 రూపాయల దొంగతనం కేసులో 41 ఏళ్ల తర్వాత రాజీ!

  • నిన్న పరిష్కారం చూపిన గ్వాలియర్‌ న్యాయమూర్తి
  • ఇకపై ఇటువంటి తప్పిదాలు చేయవద్దని నిందితుడికి సూచన
  • 1978లో బస్సులో జరిగిన సంఘటన

ఎప్పుడో 1978లో బస్సులో జరిగిన చిరు దొంగతనం కేసులో నలభై ఒక్క ఏళ్ల అనంతరం రాజీ కుదరడం గమనార్హం. విశేషాలేమంటే...నలభై ఒక్క ఏళ్ల క్రితం అంటే 1978లో బాబూలాల్‌ (61), ఇస్మయిల్‌ ఖాన్‌ (68) అనే ఇద్దరు వ్యక్తులు మధ్యప్రదేశ్‌ రాష్ట్రం గ్వాలియర్‌లో బస్సు ప్రయాణం చేస్తున్నారు. ఆ సమయంలో బాబులాల్‌ జేబులోని 20 రూపాయలు మాయమయ్యాయి. దీన్ని ఇస్మయిల్‌ఖాన్‌ దొంగిలించాడని అనుమానించిన బాబులాల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దీంతో పోలీసులు కేసు నమోదుచేసి ఇస్మయిల్‌ఖాన్‌ను అరెస్టు చేశారు. కొన్ని నెలలు జైల్లో ఉన్న తర్వాత అతను బెయిల్‌పై విడుదలయ్యాడు. కేసు విచారణ సందర్భంగా పలుమార్లు కోర్టుకు హాజరయ్యాడు. అయితే 2004 తర్వాత అతను కోర్టుకు హాజరు కావడం మానేశాడు. దీంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో కోర్టు అతని అరెస్టుకు ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు ఖాన్‌ను పట్టుకుని జైలుకు పంపడంతో మూడు నెలలుగా అక్కడే ఉన్నాడు.

ఖాన్‌ నిరుపేద కావడంతో బెయిల్‌ ఇప్పించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో కోర్టు ఇద్దరినీ పిలిపించి లోక్‌అదాలత్‌లో విచారణ నిర్వహించింది. అనంతరం ఇకపై ఇటువంటి నేరాలు చేయవద్దంటూ ఖాన్‌ నుంచి లిఖిత పూర్వక హామీ తీసుకుని విడుదల చేసింది.

More Telugu News