visakhapatnam: సింహగిరి ప్రదక్షిణకు భారీ ఏర్పాట్లు : సింహాచలంలో రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభం

  • ఏటా ఆషాఢ పౌర్ణమి  సందర్భంగా ప్రతిష్ఠాత్మక ఉత్సవం
  • 32 కిలోమీటర్ల దూరాన్ని కాలినడకన చుట్టేయనున్న భక్తులు
  • ఈ ఏడాది 10 లక్షల మంది పాల్గొంటారని అంచనా

విశాఖ నగరంలోని సింహాచలం క్షేత్రంలో ఏటా ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే సింహగిరి ప్రదక్షిణకు అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు మధ్యాహ్నం రెండు గంటలకు సింహాచలంలోని మెట్లమార్గం ప్రారంభం వద్ద కొబ్బరికాయ కొట్టి భక్తులు తమ యాత్రను ప్రారంభిస్తారు. అనంతరం అడవివరం, పైనాపిల్‌ కాలనీ, ముడసర్లోవ, పెదగదిలి, హనుమంతవాక, విశాలాక్షినగర్‌, అప్పుఘర్‌, ఎంవీపీ కాలనీ, వెంకోజిపాలెం, సీతమ్మధార, పోర్టు ఆసుపత్రి, మాధవధార, ఎన్‌ఏడీ, గోపాలపట్నం మీదుగా తిరిగి సింహాచలం చేరుకుంటారు. దాదాపు 32 కిలోమీటర్ల దూరాన్ని భక్తులు కాలినడకన పూర్తిచేసి స్వామివారి మొక్కు తీర్చుకుంటారు. అనంతరం కొండపైకి వెళ్లి స్వామి వారి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమవుతారు. దారిమధ్యలో అప్పుఘర్ వద్ద సముద్ర స్నానాలు ఆచరిస్తారు.  కొందరు సింహగిరి మాడవీధుల చుట్టూ ప్రదక్షిణ చేసి మొక్కుతీర్చుకుంటారు.

ఈ ఉత్సవంలో తెలుగు రాష్ట్రాల వాసులు, ఒడిశా, చత్తీస్‌గడ్‌, పశ్చిమబెంగాల్‌తోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో స్థిరపడిన విశాఖవాసులు హాజరవుతారు. ఈ ఏడాది ఈ ఉత్సవంలో దాదాపు 10 లక్షల మంది పాల్గొంటారని అంచనా. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవస్థానం అధికారులు పక్కా ఏర్పాట్లు చేస్తున్నారు.

దారి పొడవునా తాత్కాలిక మరుగుదొడ్లు, వైద్యశిబిరాలు, మంచినీరు ఏర్పాటు చేస్తున్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు భక్తులకు ఆహారం, టీ, స్నాక్స్‌ అందించేందుకు సిద్ధమవుతున్నాయి.

More Telugu News