Tirumala: తిరుమల వెంకన్నను దర్శించుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కుటుంబం

  • నిన్న తిరుపతి చేరుకున్న రాష్ట్రపతి కోవింద్ ఫ్యామిలీ
  • నేడు శ్రీవారి దర్శనం
  • స్వాగతం పలికిన అధికారులు, ప్రజా ప్రతినిధులు

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన సతీమణి సవితా కోవింద్‌, ఇతర కుటుంబీకులతో కలిసి, పద్మావతి అతిథి గృహం నుంచి తొలుత వరాహస్వామిని దర్శించుకుని, ఆపై ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్, ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. ఆలయ పూజారులు ఆయనకు పట్టువస్త్రాలను అందించి, స్వాగతం పలికి ఆలయంలోకి తీసుకెళ్లి, ప్రత్యేక పూజలు చేయించారు.

అనంతరం రాష్ట్రపతి కోవింద్ కుటుంబానికి తీర్థ ప్రసాదాలు అందించి, ఆశీర్వచనం చేశారు. నిన్న తిరుమలకు చేరుకున్న ఆయన, సాయంత్రం పద్మావతి అమ్మవారిని, కపిలేశ్వర స్వామివారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. మరికాసేపట్లో రాష్ట్రపతి శ్రీహరికోటకు వెళ్లనున్నారు. రాత్రికి అక్కడే బస చేసి, చంద్రయాన్-2 ప్రయోగాన్ని దగ్గరుండి పరిశీలించనున్నారు.

More Telugu News