ISRO: చంద్రయాన్-2 ప్రయోగాన్ని ఓ పండుగలా నిర్వహించేందుకు ఇస్రో ఏర్పాట్లు

  • ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రజలకు అనుమతి
  • వెల్లువెత్తిన దరఖాస్తులు
  • ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు నడపాలంటూ ఏపీ ప్రభుత్వానికి ఇస్రో విజ్ఞప్తి

భారతదేశ అంతరిక్ష చరిత్రలో అత్యంత ముఖ్యమైన ఘట్టం మరికొన్ని గంటల్లో ఆవిష్కృతం కానుంది. ఇప్పటివరకు ఎవరూ పరిశోధించని చంద్రుడి ఆవలి వైపుకు ఇస్రో చంద్రయాన్-2 పేరిట రోదసి యాత్ర నిర్వహిస్తోంది. శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి జూలై 15న వేకువజామున 2 గంటల 15 నిమిషాలకు చంద్రయాన్-2 ప్రయోగం నిర్వహిస్తారు. దీన్ని ఇస్రో హెవీవెయిట్ రాకెట్ జీఎస్ఎల్వీ ఎంకే-3 (మార్క్-3) అంతరిక్షంలోకి మోసుకుపోనుంది.

కాగా, దేశ ప్రతిష్ఠను ఇనుమడింపచేసే ప్రయోగం కావడంతో ఇస్రో దీనికోసం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. సాధారణ ప్రజలు కూడా వీక్షించేలా ఓ ఉత్సవం తరహాలో నిర్వహించాలని తలపోస్తోంది. 10 వేల మంది కూర్చునేలా గ్యాలరీలు, ఆహారపదార్థాల కోసం ప్రత్యేకంగా స్టాళ్లు, ప్రజలు ఉన్న చోట భారీ స్క్రీన్లు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించడానికి సాధారణ ప్రజానీకాన్ని అనుమతించడంతో ఇప్పటివరకు 7 వేల మందికి పైగా ఆన్ లైన్ లో తమ వివరాలు రిజిస్టర్ చేసుకున్నారు. భారీ ఎత్తులన ప్రజలు తరలిరానున్న నేపథ్యంలో, సూళ్లూరుపేట నుంచి షార్ కేంద్రం వరకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలంటూ ఇస్రో వర్గాలు ఏపీ ప్రభుత్వాన్ని కోరాయి.

More Telugu News