ధోనీని లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు పంపడంపై రవిశాస్త్రి వివరణ

13-07-2019 Sat 14:38
  • ప్రపంచంలో అత్యున్నతమైన ఫినిషర్ ధోనీ
  • చివరి ఓవర్లలో అతను ఉండటం చాలా అవసరం
  • ధోనీ ముందే వచ్చి, ఔటైపోతే విజయావకాశాలు దెబ్బతింటాయి
ప్రపంచకప్ సెమీఫైనల్స్ లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఓడిపోవడాన్ని భారత క్రికెట్ అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ధోనీని ముందుగా బ్యాటింగ్ కు పంపకుండా, 7వ స్థానంలో పంపడంపై పలువురు మండిపడుతున్నారు. ఈ అంశంపై టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు.

ఎంతో అనుభవమున్న ధోనీ చివరి ఓవర్లలో క్రీజులో ఉండటం అవసరమని, ఇది టీమ్ మొత్తం కలిసి తీసుకున్న నిర్ణయమని రవిశాస్త్రి తెలిపాడు. 'ఇది టీమ్ నిర్ణయం. ఈ నిర్ణయాన్ని తీసుకోవడం వెనుక ప్రతి ఒక్కరు ఉన్నారు. వాస్తవానికి ఇది చాలా చిన్న నిర్ణయం. ధోనీ ముందుగానే బ్యాటింగ్ కు వచ్చి, ఔటైపోతే... అది గెలిచే అవకాశాలను దారుణంగా దెబ్బ తీస్తుంది. అతని అనుభవం చివరి ఓవర్లలో చాలా కీలకం. క్రికెట్ చరిత్రలో అత్యున్నత ఫినిషర్ అయిన ధోనీని చివరి ఓవర్లలో ఆడించకపోవడం పెద్ద తప్పే అవుతుంది' అని చెప్పాడు.

మరోవైపు, రవిశాస్త్రి కాంట్రాక్ట్ ను బీసీసీఐ మరో 45 రోజుల పాటు పొడిగించింది. ఇంగ్లండ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కోహ్లీ, రవిశాస్త్రిలు బీసీసీఐ అడ్మినిస్ట్రేటర్స్ కమిటీతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో జట్టు ఓటమిపై సమీక్షను నిర్వహించనున్నారు.