KVP: రాజ్యసభలో ప్రత్యేకహోదా గళం వినిపించిన కేవీపీ

  • ఏపీకి ఐదేళ్లు ప్రత్యేకహోదా కల్పించాలన్న కేవీపీ
  • 14వ ఆర్థిక సంఘం సిఫారసులు అమలు చేయాలంటూ విజ్ఞప్తి
  • బీసీలకు చట్టసభల్లో ప్రాతినిధ్యంపై విజయసాయి ప్రైవేట్ బిల్లు

కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఏపీకి ప్రత్యేకహోదా అంశంపై రాజ్యసభలో గళం విప్పారు. ఏపీకి 14వ ఆర్థిక సంఘం కల్పించినవన్నీ అమలు చేయాలని కోరారు. రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అంతేగాకుండా, ఏపీలో పారిశ్రామికీకరణకు పెద్దపీట వేయాలని, ప్రోత్సాహక రాయితీలు అందివ్వాలని అన్నారు. ప్రత్యేకహోదా ద్వారా లభించే అన్ని రకాల ప్రయోజనాలు ఏపీకి దక్కేలా చూడాలని కేవీపీ కేంద్రాన్ని కోరారు.

మరోవైపు, వైసీపీ నేత విజయసాయిరెడ్డి బీసీలకు జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించేలా రిజర్వేషన్లు కోరుతూ రాజ్యసభలో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టారు. దీనిపై పెద్దల సభలో వాదోపవాదాలు జరిగాయి. బీసీ వ్యక్తి అయిన నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్న సమయంలో కూడా బీసీలు చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం అందుకోలేకపోతున్నారని విజయసాయిరెడ్డి తన బాణీ వినిపించారు. దీనిపై ఓటింగ్ జరపాలని విజయసాయి డిమాండ్ చేయగా, సభలో ప్రధాని లేరు కాబట్టి ఇప్పుడు ఓటింగ్ జరపలేమని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు.

More Telugu News