Railway: రైల్వేల ప్రైవేటీకరణపై క్లారిటీ ఇచ్చిన కేంద్రమంత్రి

  • రైల్వేశాఖను ప్రైవేటీకరణ చేసే ప్రసక్తేలేదన్న పియూష్ గోయల్
  • కొన్ని ప్రాజక్టుల్లో పెట్టుబడులు ఆహ్వానిస్తున్నామంటూ వివరణ
  • లోక్ సభలో విపక్షాలపై ఎదురుదాడి

జాతీయస్థాయిలో అతిపెద్ద రవాణా వ్యవస్థగా కొనసాగుతున్న భారతీయ రైల్వేను ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ విపక్షాలు చేసిన ఆరోపణను ఎన్డీయే సర్కారు తోసిపుచ్చింది. దీనిపై లోక్ సభలో రైల్వే మంత్రి పియూష్ గోయల్ స్పష్టతనిచ్చారు. రైల్వే శాఖను ప్రైవేటుపరం చేసే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు. అయితే, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా సరికొత్త సాంకేతికత, రైల్వే లైన్లు, ఇతర ప్రాజక్టులు వంటి అంశాల్లో ప్రైవేటు రంగం నుంచి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని వివరించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాలను ప్రోత్సహిస్తామని చెప్పిన మంత్రి, కొన్ని యూనిట్లను మాత్రం విస్తృత ప్రయోజనాల రీత్యా కార్పొరేటీకరణ చేస్తామని చెప్పారు. ఈ వివరణ ఇచ్చిన తర్వాత పియూష్ గోయల్ విపక్షాలపై ఎదురుదాడి మొదలుపెట్టారు. నరేంద్ర మోదీ పాలనలో రైల్వే శాఖ మౌలిక సదుపాయాలు, భద్రతా ప్రమాణాలు మరింత మెరుగయ్యాయని, యూపీఏ పాలనలో రైల్వేశాఖను నిర్లక్ష్యం చేశారంటూ విమర్శించారు.

ఇక రైల్వేశాఖకు ప్రత్యేక బడ్జెట్ పైనా ఆయన విపక్షాలకు దీటుగా బదులిచ్చారు. ప్రత్యేక బడ్జెట్ లన్నీ రాజకీయ ఉద్దేశాల కోసమేనని, కొత్త రైళ్లు, కొత్త లైన్లు అంటూ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రజల్ని మభ్యపెట్టడానికి అలాంటి ప్రత్యేక బడ్జెట్లు అని వ్యాఖ్యానించారు.

More Telugu News