Vengsarkar: రాయుడుపై పెట్టుబడి వృథా అయింది: వెంగ్ సర్కార్

  • రెండేళ్లు ఆడించి తీరా ప్రపంచకప్ లో మొండిచేయి చూపారు
  • రాయుడ్ని ఎంపిక చేయాల్సింది
  • రహానే ఉంటే బాగుండేది

వరల్డ్ కప్ లో సెమీఫైనల్ మ్యాచ్ తో టీమిండియా పోరాటం ముగియడం పట్ల క్రికెట్ దిగ్గజం దిలీప్ వెంగ్ సర్కార్ ఘాటుగా స్పందించారు. ప్రస్తుత బీసీసీఐ సెలక్షన్ ప్యానెల్ పనితీరు సరిగాలేదని విమర్శించారు. ప్రపంచకప్ ను దృష్టిలో పెట్టుకునే రాయుడ్ని రెండేళ్లుగా ఆడించారని, తీరా ప్రపంచకప్ దగ్గరికి వచ్చేసరికి అతడ్ని పక్కన పెట్టారని వెంగీ మండిపడ్డారు. సెలక్టర్లు రాయుడి గురించి ఆలోచించి ఉంటే కచ్చితంగా ఎంపిక చేయాల్సిందని, ఇప్పుడు అతడిపై పెట్టిన పెట్టుబడి అంతా వృథా అయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

రహానే, పుజారా వంటి ఆటగాళ్లను బ్యాకప్ ప్లేయర్స్ గా తీసుకుని ఉంటే జట్టు ఎంతో బలంగా ఉండేదని, అలాకాకుండా రిషబ్ పంత్, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్ లను బ్యాకప్ ప్లేయర్స్ గా తీసుకుంటే ఏంజరిగిందో చూశాం కదా అంటూ విమర్శించారు. ఇంగ్లాండ్ లో కౌంటీ క్రికెట్ ఆడిన రహానే, పుజారాలకు అక్కడి పరిస్థితులపై అవగాహన ఉంటుందని, ఇన్నింగ్స్ నిర్మించడం వాళ్లకు సులువైన పని అని వెంగ్ సర్కార్ అభిప్రాయపడ్డారు.

జట్టులో ముగ్గురు వికెట్ కీపర్లను తీసుకోవాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. దేశవాళీ క్రికెట్లో స్పెషలిస్ట్ బ్యాట్స్ మన్లు కరవయ్యారా అంటూ నిలదీశారు. 50 ఓవర్ల ఆటలో కనీసం ఐదుగురు స్పెషలిస్టు బ్యాట్స్ మన్లు లేకపోతే ఎలా? అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇక, కొత్త కుర్రాడు విజయ్ శంకర్ ను నిందించడం సరికాదని, పైగా అతను గాయపడ్డాడు కూడా అంటూ సానుభూతి వ్యక్తం చేశారు. రిటైర్ కావాలంటూ ధోనీని సెలక్టర్లు ఒత్తిడి చేయరాదని సూచించారు. దేశానికి మంచి పేరు తీసుకువచ్చిన ధోనీకి కెరీర్ ఎప్పుడు ముగించాలో తెలుసన్నారు.

More Telugu News