Revathi: మై హోమ్ రామేశ్వరరావు, మెగా కృష్ణారెడ్డి... అమేజింగ్ వర్కండీ: మోజో టీవీ మాజీ సీఈఓ రేవతి సెటైర్

  • కార్పొరేట్ కంపెనీల ప్రోద్బలంతో జర్నలిస్టులపై వేధింపులు
  • ఏసీపీ కేఎస్ రావు ఆదేశాలతోనే అరెస్ట్
  • నిజాన్ని ఎల్లకాలం దాచివుంచలేరన్న రేవతి

తెలంగాణలోని కార్పొరేట్ కంపెనీల ప్రోద్బలంతో జర్నలిస్టులను వేధిస్తున్నారని, ప్రభుత్వం తక్షణమే కల్పించుకోవాలని మోజో టీవీ మాజీ సీఈఓ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ఈ ఉదయం అరెస్టయిన రేవతి డిమాండ్ చేశారు. ఈ ఉదయం తన ట్విట్టర్ ఖాతాలో పలు ట్వీట్లు పెట్టిన ఆమె, తన అరెస్ట్ వెనుక మెగా సంస్థల అధినేత కృష్ణారెడ్డి, మై హోమ్ సంస్థ అధినేత రామేశ్వరరావు వున్నారని ఆరోపించారు. వారిద్దరూ తమ తెలివితేటలను అద్భుతంగా ఉపయోగించారని, నిజం ఇవాళ కాకపోయినా, రేపయినా బయటకు వస్తుందని అన్నారు.

ఎన్నటికీ నిజాన్ని దాచివుంచలేరని వ్యాఖ్యానించారు. ఓ జర్నలిస్ట్ ను వారెంట్ కూడా లేకుండా అరెస్ట్ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి టాప్ ప్రియారిటీగా కనిపిస్తోందని రేవతి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జనవరిలో నమోదైన ఓ కేసులో తనను ఏ2గా చేర్చారని, తనకు కనీసం నోటీసులు ఇవ్వలేదని, వారెంట్ కూడా లేకుండా అరెస్ట్ చేయడానికి వచ్చారని ఆమె ఆరోపించారు. ఇదంతా ఏసీపీ కేఎస్ రావు ఆదేశాల మేరకు జరిగిందన్నారు. వారు తన ఫోన్ ను లాక్కునే ప్రయత్నం కూడా చేశారని, పోలీసులను వీడియో తీయబోతే అడ్డుకున్నారని ట్విట్టర్ లో పేర్కొన్నారు. కనీసం తన బిడ్డను స్కూలుకు పంపించేందుకు సమయం ఇవ్వాలని కోరినా అంగీకరించలేదని, తానేమీ టెర్రరిస్ట్ ను కాదని అన్నారు.

More Telugu News