DS: అమిత్ షాను కలిసిన డీఎస్.. చర్యలకు టీఆర్ఎస్ సిద్ధం!

  • మొన్న టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి డీఎస్
  • నిన్న బీజేపీ చీఫ్ అమిత్‌షాతో సమాలోచనలు
  • తీవ్రంగా పరిగణిస్తున్న టీఆర్ఎస్ అధిష్ఠానం

మొన్న టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరైన రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ నిన్న కేంద్రమంత్రి, బీజేపీ చీఫ్ అమిత్ షాను కలిసి మంతనాలు జరిపి మరోమారు వార్తల్లోకి ఎక్కారు. అమిత్ షాను డీఎస్ కలిసిన విషయాన్ని టీఆర్ఎస్ ఎంపీలు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో డీఎస్ వ్యవహారాన్ని అధిష్ఠానం తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలుస్తోంది.

పార్టీ ఫిరాయింపునకు సంబంధించిన ఆధారాలు లభిస్తే అనర్హత వేటు కోసం  రాజ్యసభ ఛైర్మన్‌కు ఫిర్యాదు చేయాలని భావిస్తోంది. బుధవారం టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరైన డీఎస్.. నిన్న అమిత్ షాను కలవడం వెనక ఏదైనా వ్యూహం ఉండే అవకాశం ఉందని టీఆర్ఎస్ నేతలు అనుమానిస్తున్నారు. పథకం ప్రకారమే డీఎస్ ఇలా చేస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ జిల్లా నేతలు పార్టీ అధిష్ఠానాన్ని కోరారు. కాగా, అమిత్ షాను డీఎస్ ఓ ఎంపీ హోదాలో కలిశారని, అంతేతప్ప రాజకీయంగా ఈ సమావేశానికి ఎటువంటి ప్రాధాన్యం లేదని డీఎస్ సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయి.

More Telugu News