ముంబయి వెళ్లినా, ఢిల్లీ వెళ్లినా అంతిమ నిర్ణయం నాదే... కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

- మరింత ముదిరిన కర్ణాటక రాజకీయ సంక్షోభం
- ఎమ్మెల్యేలు స్పీకర్ ముందు హాజరవ్వాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఘాటుగా స్పందించిన కర్ణాటక అసెంబ్లీ స్పీకర్
తాను ఎవరినీ రక్షించడంలేదని, ఎవరినీ వ్యతిరేకించడంలేదని అన్నారు. తనపై కొందరు అసత్యప్రచారం చేస్తున్నారని రమేశ్ కుమార్ మండిపడ్డారు. తనవైపు నుంచి ఉద్దేశపూర్వకంగా ఎలాంటి జాప్యంలేదని, తాను సంతృప్తి చెందినప్పుడే రాజీనామాలు ఆమోదిస్తానని స్పష్టం చేశారు. హడావుడిగా నిర్ణయం తీసుకోవాలనడం సరికాదని, తన నిర్ణయం చారిత్రాత్మకం కావాలని ఆయన ఉద్ఘాటించారు. పార్టీ ఫిరాయింపులు దేశరాజకీయాల్లో దరిద్రం అని అభివర్ణించారు.
సుప్రీం కోర్టు కూడా సదరు ఎమ్మెల్యేలను స్పీకర్ ముందు హాజరు కావాలని మాత్రమే చెప్పిందని, తనను కలిసేందుకు సుప్రీం కోర్టు అనుమతి అవసరమా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏదేమైనా నాలుగు గోడల మధ్య తేలాల్సిన అంశాన్ని దేశవ్యాపితం చేశారని స్పీకర్ రమేశ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ముంబయి వెళ్లినా, ఢిల్లీ వెళ్లినా అంతిమంగా నిర్ణయం తీసుకోవాల్సింది తానేనని తేల్చిచెప్పారు.