England: బ్యాట్ తగలకపోయినా అవుట్ ఇవ్వడంతో అంపైర్ పై రెచ్చిపోయిన ఇంగ్లాండ్ ఓపెనర్ రాయ్

  • అంపైర్ ధర్మసేనపై రాయ్ ఆగ్రహం
  • కీపర్ క్యాచ్ అంటూ అవుటిచ్చిన ధర్మసేన
  • బ్యాట్ కు బంతి తగల్లేదని రీప్లేలో తేలిన వైనం

బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ సెమీఫైనల్ లో అవాంఛనీయ సన్నివేశం చోటుచేసుకుంది. లక్ష్యఛేదనలో దూకుడుగా ఆడుతున్న ఇంగ్లాండ్ ఓపెనర్ జాసన్ రాయ్ తనను అవుట్ అంటూ నిర్ణయం ప్రకటించిన అంపైర్ ధర్మసేనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. కమ్మిన్స్ బౌలింగ్ లో లెగ్ సైడ్ వెళుతున్న బంతిని హుక్ చేసేందుకు బలంగా బ్యాట్ ఊపాడు. అయితే ఆ బాల్ మిస్సవడమే కాదు, నేరుగా ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ కేరీ చేతుల్లో వాలింది. ఆసీస్ ఫీల్డర్లందరూ అప్పీల్ చేయడంతో ధర్మసేన తటపటాయిస్తూనే వేలు పైకెత్తాడు.

అప్పటికే ఇంగ్లాండ్ డీఆర్ఎస్ రివ్యూలు అయిపోవడంతో, తాను అవుట్ కాలేదంటూ రాయ్ వాదనకు దిగాడు. లెగ్ సైడ్ అంపైర్ కూడా వచ్చి రాయ్ కు నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. దాంతో మైదానం వీడుతూనే అంపైర్ ధర్మసేనను నోటికొచ్చినట్టు తిడుతూ రాయ్ రెచ్చిపోయాడు. చివరికి మైదానంలో ఉన్న భారీ స్క్రీన్ పై రీప్లే చూసిన తర్వాత రాయ్ మరింతగా నోటికి పనిచెప్పాడు. బౌండరీ లైన్ దాటి డ్రెస్సింగ్ రూమ్ వద్దకు వెళ్లే వరకు తన ఆగ్రహాన్ని వెళ్లగక్కుతూనే ఉన్నాడు. 65 బంతులాడిన రాయ్ 5 సిక్స్ లు, 9 ఫోర్లతో 85 పరుగులు చేశాడు.

More Telugu News