ఇంగ్లాండ్ బౌలర్ల మూకుమ్మడి దాడి... ఆసీస్ 223 ఆలౌట్

11-07-2019 Thu 18:58
  • బర్మింగ్ లో ప్రపంచకప్ సెమీఫైనల్
  • రాణించిన ఇంగ్లీష్ బౌలర్లు
  • పరుగుల కోసం చెమటోడ్చిన కంగారూలు
బర్మింగ్ హామ్ లోని ఎడ్జ్ బాస్టన్ మైదానంలో జరుగుతున్న ప్రపంచకప్ సెమీఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది. టాస్ ఓడిన ఇంగ్లాండ్ పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకుని ఆరంభ ఓవర్లలోనే ఆసీస్ ను కోలుకోలేని దెబ్బకొట్టింది. 15 పరుగులకే 3 వికెట్లు పడడంతో కంగారూలు భారీ స్కోరు ఆశలు ఆవిరయ్యాయి. వికెట్లు కాపాడుకోవడమే వారికి అత్యంత ప్రాధాన్య అంశంగా మారింది. వార్నర్, ఫించ్, హ్యాండ్స్ కోంబ్, స్టొయినిస్ స్వల్ప స్కోర్లకే వెనుదిరిగినా, స్మిత్ మొండిగా పోరాడాడు.

స్మిత్ 85 పరుగులు చేసి ఎనిమిదో వికెట్ రూపంలో రనౌట్ గా వెనుదిరిగాడు. మరోవైపు వికెట్ కీపర్ అలెక్స్ కేరీ గాయం బాధిస్తున్నా 46 పరుగులు చేసి తనవంతు సహకారం అందించాడు. మ్యాక్స్ వెల్ దూకుడుగా ఆడుతూ 23 బంతుల్లో 22 పరుగులు చేసి ఆర్చర్ బౌలింగ్ లో అవుటయ్యాడు. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ బౌలర్ల ప్రతిభ పతాకస్థాయిలో కనిపించిందని చెప్పాలి. ఆసీస్ కు ఏ దశలోనూ అవకాశం ఇవ్వకుండా కట్టడి చేశారు. వోక్స్ 3, రషీద్ 3, ఆర్చర్ 2, ఉడ్ 1 వికెట్ తో రాణించారు.