Andhra Pradesh: టీడీపీ హయాంలో ప్రతిపక్షం అంటే ‘పనికిరాని పక్షం’గానే చూశారు.. మేం అలా చేయబోం!: బొత్స సత్యనారాయణ

  • విశాఖలో తీవ్రమైన నీటికొరత ఉంది
  • అందుకు టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం
  • టీడీపీ సభ్యులు నిర్మాణాత్మక సలహాలు, సూచనలు ఇవ్వాలి

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలరోజులు మాత్రమే అయిందని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విశాఖపట్నం లాంటి నగరంలో రెండ్రోజులకు ఓసారి మాత్రమే నీటి సరఫరా జరుగుతుందంటే, గత ప్రభుత్వాలకు దూరదృష్టి లేకపోవడమే కారణమని వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వం కొంచెం ఆలోచించి ఉంటే ప్రజలకు ఈ ఇబ్బంది ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. ఏపీలో కరవుపై చర్చ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడారు.

టీడీపీ ఎమ్మెల్యేలు దయచేసి ఫిర్యాదులు చేయకుండా నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని సూచించారు. ఇలా నిర్మాణాత్మక సలహాలు, సూచనలు ఇవ్వాలని టీడీపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో తమను కోరలేదని బొత్స స్పష్టం చేశారు. కావాలంటే రికార్డులు పరిశీలించుకోవాలని సవాల్ విసిరారు. టీడీపీ హయాంలో ప్రతిపక్షం అంటే పనికిరాని పక్షంగానే చూశారని బొత్స విమర్శించారు. కానీ వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాన్ని కూడా విశ్వాసంలోకి తీసుకుంటుందని స్పష్టం చేశారు. తమను ఒకటి అని, తమ చేత 10 అనిపించుకోవద్దని బొత్స హితవు పలికారు.

More Telugu News