babri masjid: ‘బాబ్రీమసీదు-అయోధ్య’ మధ్యవర్తిత్వ కమిటీకి సుప్రీం అల్టిమేటం.. తామే రంగంలోకి దిగుతామని ప్రకటన!

  • ఈ నెల 18లోగా ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపండి
  • లేదంటే జూలై 25 నుంచి మేం విచారణ చేపడతాం
  • సుప్రీంకోర్టు తలుపు తట్టిన గోపాల్ సింగ్ విశారద్

బాబ్రీమసీదు-రామజన్మభూమి వివాదంపై మధ్యవర్తిత్వ కమిటీకి సుప్రీంకోర్టు ఈరోజు అల్టిమేటం జారీచేసింది. ఈ వివాదంలో ఇరువర్గాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని ఈ నెల 18లోగా సూచించాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. లేదంటే తామే రంగంలోకి దిగుతామనీ, ఈ నెల 25 నుంచి రోజువారీ విచారణ చేపడతామని స్పష్టం చేసింది. రామజన్మభూమి-బాబ్రీమసీదు కేసులో మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు మాజీ జడ్జి ఎఫ్‌.ఎం.ఖలీఫుల్లా, ‘ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌’ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌, ప్రముఖ సీనియర్‌ న్యాయవాది శ్రీరామ్‌ పంచులతో కమిటీని సుప్రీంకోర్టు నియమించింది.

ఇటీవల ఈ కమిటీ తమ మధ్యంతర నివేదికను సుప్రీంకు సమర్పించింది. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనేందుకు మరింత సమయం కావాలని కమిటీ కోరింది. దీంతో ఆగస్టు 15 వరకూ గడువు ఇస్తున్నట్లు అత్యున్నత న్యాయస్థానం చెప్పింది. అయితే ఈ మధ్యవర్తిత్వంతో ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదని రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంలో పిటిషనర్ అయిన గోపాల్ సింగ్ విశారద్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వెంటనే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ఆయన కోరడంతో.. సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులు జారీచేసింది.

More Telugu News