USA: గ్రీన్ కార్డులపై గరిష్ట పరిమితి ఎత్తివేసిన అమెరికా.. భారతీయులకు భారీగా లబ్ధి!

  • బిల్లుకు ఆమోదం తెలిపిన సెనేట్
  • ఇప్పటివరకూ భారత్ కు గరిష్టంగా 7 శాతం గ్రీన్ కార్డులు
  • తాజా నిర్ణయంతో భారత్, చైనాలకు గణనీయమైన లబ్ధి

అగ్రరాజ్యం అమెరికా ఈ రోజు కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ వృత్తి నిపుణులు అమెరికాలో శాశ్వతంగా నివాసం ఉంటూ ఉద్యోగం చేసుకునేందుకు ఉద్దేశించిన ‘గ్రీన్ కార్డు’ల జారీపై గరిష్ట పరిమితిని ఎత్తివేసింది. దీని కారణంగా అమెరికాలో గ్రీన్ కార్డుల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న భారతీయులకు లబ్ధి చేకూరనుంది. ఒక్కో దేశానికి గరిష్టంగా 7 శాతం గ్రీన్ కార్డులు మాత్రమే జారీచేయాలన్న నిబంధనను ఎత్తివేయాలని అమెరికా సెనెట్ లో బిల్లును ప్రవేశపెట్టారు.

దీనికి సెనెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం ఇకపై ప్రతిభ ఆధారంగానే విదేశీయులకు గ్రీన్ కార్డులు జారీచేయనున్నారు. ప్రస్తుతం అమెరికాలో పెండింగ్ లో ఉన్న భారతీయుల గ్రీన్ కార్డు దరఖాస్తులు ఆమోదం పొందాలంటే 70 ఏళ్లు పడుతుందని అంచనా. తాజా బిల్లులో ఒక్కో దేశం మీద ఉన్న 7 శాతం గ్రీన్ కార్డుల పరిమితిని సడలించారు. దీంతో భారత్‌, చైనా వంటిదేశాలకు భారీగా ప్రయోజనం చేకూరుతుంది.

ఉద్యోగ ఆధారిత గ్రీన్‌ కార్డుల్లో ఈ కోటాను ఎత్తివేయడంతోపాటు ‘ఫ్యామిలీ స్పాన్సర్డ్‌’ విభాగంలో 15 శాతానికి పెంచాలని తాజా బిల్లులో ప్రతిపాదించారు. అమెరికాలోని సంస్థలు ప్రధానంగా హెచ్‌-1బి వీసాల ద్వారానే విదేశీ నిపుణులను నియమించుకుంటాయి. వీటిపై పనిచేసేవారిలో భారతీయులే అత్యధికం. తాజా బిల్లులు చట్టరూపం దాల్చడంతో గ్రీన్‌కార్డుల కోసం వారి నిరీక్షణ సమయం గణనీయంగా తగ్గుతుంది. ఉద్యోగ ఆధారిత (ఈబీ) వీసాల కింద ప్రస్తుతం అమెరికా ఏటా 1.4 లక్షల మందికి గ్రీన్‌కార్డులు జారీచేస్తోంది.

More Telugu News