Andhra Pradesh: గోదావరి గురించి సీఎం జగన్ చెబుతుంటే 23 మంది ఆశ్చర్యంగా నోరు తెరుచుకుని చూస్తున్నారు!: మంత్రి బుగ్గన ఎద్దేవా

  • టీడీపీ నేతలకు సబ్జెక్ట్ తెలియదు.. మాకు తెలుసు
  • కృష్ణానదిలో 600 టీఎంసీలు తగ్గిందన్నది కూడా వాళ్లకు తెలియదు
  • అధికారం చేపట్టి నెలరోజులు కాలేదు.. అప్పుడే మామీద పడి ఏడుస్తారా?

ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టే అధికారం వైసీపీ ప్రభుత్వానికి లేదని ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యానించడంపై రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పందించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎందుకు అంత ఆవేశపడుతున్నారో తనకు అర్థం కావడం లేదని రాజేంద్రనాథ్ అన్నారు.

 ‘అధ్యక్షా.. ముఖ్యమంత్రి జగన్ గారు చాలా సింపుల్ గా గోదావరి నది ఎక్కడి నుంచి వస్తుంది? నాసిక్ నుంచి, ప్రాణహిత నుంచి ఎంత భాగం వస్తుంది? ఇంద్రావతి నుంచి ఎంత వస్తుంది? శబరి నుంచి ఎంత వస్తుందో చెబుతుంటే ఆశ్చర్యంగా ఆ 23 మంది టీడీపీ సభ్యులు నోర్లు తెరుచుకుని చూస్తున్నారు అధ్యక్షా.

ఎందుకంటే ఈ సబ్జెక్టు మాకు తెలుసు. వాళ్లకు తెలియదు. ఇది కాకుండా కృష్ణానదిలో కిందకు రావాల్సిన 1200 టీఎంసీ నీటిలో ఇప్పుడు 600 టీఎంసీలు మాత్రమే వస్తున్నాయన్న విషయం కూడా టీడీపీ సభ్యులకు తెలిసిఉండదు. ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుని ఆ ఆవేదన ఎందుకు? భావితరాలు అని చెప్పడం ఎందుకు? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండేది, ఆల్మట్టి ప్రాజెక్టు కట్టడాలు, ఎత్తు పెంచడాలు, అనుమతులు రావడం అన్నీ టీడీపీ ప్రభుత్వం ఇక్కడ ఉన్నప్పుడే జరిగాయి.

అసలు బ్రజేశ్ కుమార్ అవార్డు ఎట్లా వచ్చింది అధ్యక్షా? ఏపీ రిప్రజంటేషన్ సరిగ్గా లేకపోవడం వల్లే బ్రజేశ్ కుమార్ ట్రైబ్యునల్ మనకు వ్యతిరేకంగా వచ్చింది. అందువల్లే ఈరోజు ఇబ్బంది పడుతున్నాం. ప్రతిపక్ష నేతగా రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్ పోరాడారు. అప్పుడు ఓ స్టాండ్ తీసుకున్నారు. ఇప్పుడు ఏపీ ప్రయోజనాల కోసం ఈ స్టాండ్ తీసుకున్నాం. స్టాండ్ అన్నది డైనమిక్ అధ్యక్షా.. స్టాటిక్ గా ఉండదు. ఈ విషయంలో టీడీపీ ఆత్మవిమర్శ చేసుకోవాలి’ అని బుగ్గన రాజేంద్ర నాథ్ హితవు పలికారు. తాము అధికారంలోకి వచ్చి నెలరోజులు కాకపోయినా తమపై పడిపోయి టీడీపీ సభ్యులు బాధపడుతున్నారని విమర్శించారు.

More Telugu News