Goa: ఒక దేశం.. ఒకే పార్టీ.. ఇదే బీజేపీ సిద్ధాంతం: గిరీశ్ చోదాంకర్ సెటైర్

  • ప్రలోభాలకు గురి చేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాక్కున్నారు
  • బీజేపీ చెబుతున్న 'నయా భారత్' ఇదేనా?
  • ప్రజా తీర్పుకు గౌరవం లేకుండా పోతోంది

బీజేపీ దెబ్బకు కర్ణాటకలోని జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం విలవిల్లాడుతోంది. ఈ ఉత్కంఠ కొనసాగుతున్న సమయంలోనే... గోవాలో కూడా బీజేపీ పంజా విసిరింది. 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో విలీనమవుతున్నట్టు ప్రకటించారు. గోవా అసెంబ్లీలో మొత్తం 15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండగా... మూడింట రెండొంతుల మంది పార్టీ నుంచి చీలిపోయారు.

ఈ నేపథ్యంలో గోవా కాంగ్రెస్ అధ్యక్షుడు గిరీశ్ చోదాంకర్ మాట్లాడుతూ, ఇది బీజేపీ అభద్రతా భావాన్ని సూచిస్తోందని అన్నారు. సభలో కావాల్సినంత మెజార్టీ ఉన్నప్పటికీ... బీజేపీ ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడుతున్నారని... రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత బలంగా ఉన్న విపక్షాన్ని ఎదుర్కోవడానికి ఆయన భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. 'ఒక దేశం.. ఒకే పార్టీ' అనేదే బీజేపీ సిద్ధాంతమని మండిపడ్డారు.

తమ ఎమ్మెల్యేల బలహీనతలను అనుకూలంగా మలచుకుని... వారిని ప్రలోభాలకు గురి చేసి లాక్కున్నారని గిరీశ్ ఆరోపించారు. దేశ వ్యాప్తంగా ఇలాంటి నీతి లేని చర్యలకు బీజేపీ పాల్పడుతోందని విమర్శించారు. లోక్ సభ ఎన్నికల తర్వాత బీజేపీ చెబుతున్న 'నయా భారత్' ఇదేనా? అని ప్రశ్నించారు. బీజేపీ పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని దుయ్యబట్టారు. 2017 ఎన్నికల్లో ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా బీజేపీతో జట్టుకట్టిన ఆ పార్టీ మిత్రపక్షాలకు కూడా ఇదొక గుణపాఠమని చెప్పారు. సామాన్య ప్రజల తీర్పుకు ఎలాంటి గౌరవం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయికి వెళ్లి, బీజేపీని ఎండగట్టడానికి కాంగ్రెస్ కు ఇది సరైన సమయమని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ నగ్నంగా ఎలా నిలబెడుతోందో ప్రజలంతా గమనిస్తున్నారని తెలిపారు.

More Telugu News