42 ఏళ్ల ఈ ఉపాధ్యాయుడికి పది కోట్ల ఆస్తి ఉన్న వధువు కావాలట!

11-07-2019 Thu 09:22
  • పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఉపాధ్యాయుడి నిర్వాకం
  • వైరల్ అవుతున్న పత్రికా ప్రకటన
  • చర్యలు తీసుకుంటామన్న ఉపాధ్యాయ సంఘం
ఆశకు కూడా హద్దు ఉండాలని ఇందుకే అంటారు కాబోలు. 42 ఏళ్లు అయినా పెళ్లి కాని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు తాజాగా వధువు కోసం వేట ప్రారంభించాడు. పెళ్లి సంబంధాలు చూడమని తెలిసినవారికి, బంధువులకు చెప్పి పెట్టాడు. పనిలో పనిగా పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చాడు. ప్రకటన సాధారణమే అయినా, అందులోని విషయం మాత్రం అసాధారణంగా ఉంది. తనను పెళ్లి చేసుకోబోయే వధువుకు కనీసం పది కోట్ల రూపాయల ఆస్తి ఉండాలని షరతు పెట్టాడు. పశ్చిమబెంగాల్‌లోని సిలిగురికి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు చేసిన నిర్వాకమిది. పేరు వెల్లడించకుండా ఆయన ఇచ్చిన పర్యటన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ప్రకటనపై ఇప్పటికే బోల్డన్ని మీమ్స్ కూడా సృష్టించారు. విషయం ఉపాధ్యాయ సంఘం దృష్టికి వెళ్లడంతో స్పందించింది. ప్రకటన ఇచ్చిందెవరో తెలుసుకుని చర్యలు తీసుకుంటామని తెలిపింది.