TRS: టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి డీఎస్.. పార్టీలో కొత్త చర్చ!

  • గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న డీఎస్
  • అప్పట్లో  పార్టీని వీడుతారన్న ప్రచారం
  • తాజా సమావేశానికి పిలిస్తేనే వెళ్లానని వివరణ

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్ అయింది. గత కొంతకాలంగా టీఆర్ఎస్ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ ఆ పార్టీ పార్లమెంటరీ సమావేశంలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. టీఆర్ఎస్ అగ్రనేత కె.కేశవరావు అధ్యక్షతన బుధవారం పార్లమెంటు భవనంలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి డీఎస్ హాజరు కావడం చర్చనీయాంశమైంది.

పార్టీతో విభేదాల కారణంగా డీఎస్ గత కొంతకాలంగా టీఆర్ఎస్‌కు దూరంగా ఉంటున్నారు. ఒకానొక దశలో ఆయన పార్టీని వీడుతారన్న ప్రచారం కూడా జరిగింది. డీఎస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ నిజామాబాద్ జిల్లా పార్టీ నేతలు కేసీఆర్‌కు లేఖ రాశారు. ఆ లేఖలోని ఆరోపణలను రుజువు చేయాలంటూ, పార్టీ అధినేతకు డీఎస్ లేఖ రాయడంతో అప్పట్లో వాతావరణం వేడెక్కింది.

ఆ తర్వాత వరుసగా జరిగిన పరిణామాలతో డీఎస్ పార్టీ వీడడం దాదాపు ఖాయమైనట్టేనని వార్తలు వచ్చాయి. ఇందుకు నిదర్శనంగా పార్టీ కార్యక్రమాలకు కూడా చాలా కాలంగా దూరంగా ఉంటున్నారు. అయితే, తాజాగా పార్టీ పార్లమెంటరీ సమావేశంలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు డీఎస్ బదులిస్తూ.. తానేమీ పార్టీకి దూరంగా జరగలేదని, వాళ్లు పిలిస్తేనే సమావేశానికి వెళ్లానని బదులిచ్చారు. మరోపక్క, సమావేశం గురించిన సమాచారాన్ని టీఆర్ఎస్ ఎంపీల వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ పెట్టడం వల్లే డీఎస్ వచ్చారని పార్టీ ఎంపీలు కేసీఆర్ కు చెప్పారట.     

More Telugu News